ప్రాణాలు కాపాడే డాక్టర్ పై ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశాడు. కొట్టొద్దని డాక్టర్ వేడుకుంటున్నా కనికరించలేదు. అందరి ముందే దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనసేన కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ఈ దాడికి పాల్పడ్డారు.
కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల క్రీడా మైదానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మైదానంలో బయట వ్యక్తులు వాలీబాల్ ఆడుతుండటంతో తాము ఆడుకునే అవకాశం దక్కలడంలేదంటూ వైద్యవిద్యార్థులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు.దాంతో కళాశాలలో బయటవారు ఆడకుండా ఆంక్షలు విధించారు. అయితే సాయంత్రం ఆడటానికి వచ్చిన బయటివారును సిబ్బంది అడ్డుకోవడంతో వారితో గొడవ జరిగింది. ఈ గొడవ స్థానిక ఎమ్మెల్యే నానాజీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రాత్రి మైదానానికి వచ్చి అక్కడ వున్న వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డాక్టర్ పై చెయ్యెత్తారు. చంపేస్తా అంటూ ఊగిపోయారు. తనను తిట్టాల్సిన పనేంటి, కుర్రాళ్లను రెచ్చగొడతావా అంటూ ఎమ్మెల్యే నానాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటిది ఏమీ అనలేదని ఆ వైద్యుడు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా వినలేదు. వైద్యుడి ముఖానికి ఉన్న మాస్కు లాగి.. కొట్టడానికి చెయ్యి ఎత్తారు. ఇంతలో ఆయన అనుచరులు వైద్యుడిపై చెయ్యి చేసుకున్నారు.
ఈ గొడవ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే నానాజీ క్షమాపణ చెప్పారు.