తెలంగాణ

డబ్బుల్లేవ్.. డీఏలు ఇవ్వలేం.. ఉద్యోగుల ముందు చేతులెత్తేసిన సీఎం!

దీపావళి కానుక వస్తుందని ఆశించిన తెలంగాణ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలిందని తెలుస్తోంది. డీఏలు సహా పెండింగ్ సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చలు జరిపారు.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎంతో జరిగిన సమావేశంలో ఉద్యోగుల మొత్తం 51 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారు. ఇందులో ఆరు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పెండింగ్లో ఉన్న 5 డిఏలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఉద్యోగుల హెల్త్ కార్డులు, పిఆర్సి , CPS రద్దుతో పాటు వివాదాస్పంగా మారిన 317 జీవో ను సమీక్షించాలని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. అయితే ఉద్యోగుల సమస్యలపై వెంటనే హామీ ఇవ్వలేకపోయారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చెప్పారని తెలుస్తోంది. ప్రభుత్వానికి సహకరించాలని కోరారట. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడగానే అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారంటున్నారు. డబ్బులు లేవంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో గంపెడాశతో వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు ఢీలా పడ్డారని అంటున్నారు.

సమావేశం తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సబ్ కమిటీ చైర్మన్ గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా , ప్రత్యేక ఆహ్వానితులుగా కె.కేశవరావు ఉంటారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీపావళి తరువాత డిపార్ట్ మెంట్స్ వారీగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుందని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డీఏ ల విషయంలో రేపు సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. 317 జీవోపై కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు సీఎం.

సీఎంతో సమావేశం అనంతరం జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడి ప్రకటన చేస్తామని సీఎం చెప్పినట్లు వారు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అన్ని విషయాలను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ వస్తున్నామనీ.. ఒకటి రెండ్రోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం తెలిపినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉందని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యను పరిష్కిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు జేఏసీ నేతలు తెలిపారు. అయితే ప్రభుత్వం స్పందనపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. సబ్ కమిటీ వేయడం అంటే కాలాయపన కోసమేనని అంటున్నారు. ఎన్నికల సమయంలో అన్ని చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చి.. ఏడాది కావస్తున్నా ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నకల్లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను మోసం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.

Back to top button