
తెలంగాణ ప్రభుత్వంలో బ్రోకర్లు, లంచ గొండి అధికారుల రాజ్యం నడుస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఏ పని కావాలన్న బహిరంగంగానే అధికారులు లంచం అడుగుతున్నారని చెబుతున్నారు. యూరియా బస్తాల నుంచి ప్రభుత్వంలో ఏ పథకం వచ్చినా అధికారుల జేబులు తడపనిదే పని కావడం లేదని లబ్దిదారులు మండిపడుతున్నారు. తాజాగా డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు చేస్తానంటూ లబ్దిదారుడికి గ్రామ కార్యదర్శి డిమాండ్ చేస్తున్న ఆడియో కాల్ లీకై వైరల్ గా మారింది.
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని పైలెట్ గ్రామం అయిన జాన్‌పహాడ్‌లో పంచాయతీ కార్యదర్శి వసూళ్లకు పాల్పడుతున్నాడు.ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ఒక లబ్ధిదారుడిని 2% కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేకపోతే బిల్లు మంజూరు అవ్వదని పంచాయతీ కార్యదర్శి బెదిరింపులకు దిగాడు.
తనకు ఇచ్చే కమీషన్ తాను ఒక్కడినే తీసుకోనని.. ఏఈ, డీఈలకు కూడా వాటా ఉంటుందని చెప్పాడు సదరు గ్రామ కార్యదర్శి. ఆ కాల్ రికార్డింగ్‌ను బయట పెట్టాడు లబ్ధిదారుడు.మండలంలో అనేక మంది వద్ద డబ్బులు వసూలు చేస్తున్న పంచాయతీ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లబ్ధిదారులు.