Uncategorized

టీడీపీలోకి తీగల జంప్.. బాబుకు టచ్‌లో మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతానని ప్రకటించడం సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి.. హైదరాబాద్ మేయర్ గా పని చేశారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018లో మహేశ్వరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే హైదరాబాద్ నివాసంలో చంద్రబాబును కలిసిన తీగల కృష్ణారెడ్డి తాను తిరిగి టీడీపీలో చేరుతానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహ పత్రికను చంద్రబాబుకు అందించారు. మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి వియ్యంకులు కావడంతో పెళ్లి కార్డును చంద్రబాబుకు ఇవ్వడానికి కలిసి వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కాని చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన తీగల కృష్ణారెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేరుతానని ప్రకటించి అందరిని షాకింగ్ కు గురి చేశారు. అంతేకాదు చంద్రబాబు వల్లే హైదరబాద్ అభివృద్ది చెందిందన్న తీగల.. తెలంగాణలో టీడీపీకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారన్నారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. దీంతో పక్కా ప్లాన్ తోనే తీగల కృష్ణారెడ్డి ఏపీ సీఁం చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీలో చేరుతానంటూ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కొంత కాలంగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణలో నేతలతో వరుసగా సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ చేరుతానంటూ తీగల ప్రకటించడం హాట్ హాట్‌గా మారింది. మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి చంద్రబాబును కలిసిన తీగల.. ఈ ప్రకటన చేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

తీగల కృష్ణారెడ్డి బాటలోనే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతారనే టాక్ వస్తోంది. టీడీపీలో చేరుతానంటూ తీగల ప్రకటన చేస్తున్న సమయంలో ఆయన పక్కనే మల్లారెడ్డి ఉన్నారు. దీంతో తీగలతో పాటు మల్లారెడ్డి ఫ్యామిలీ టీడీపీలో చేరుతాందా అన్న చర్చ సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇటీవల కాలంలో తరచుగా చంద్రబాబును కలుస్తున్నారు. ఆయన కూడా టీడీపీలో చేరే ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారంటున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా తిరిగి సొంతగూటికి చేరే ప్రయత్నాల్లో ఉన్నారని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button