బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి రెచ్చిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మెన్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తిరుమల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హిందువులు అత్యంత పవిత్రంగా కొలిచే తిరుమలను వక్ఫ్ బోర్డుతో పోలుస్తావా అంటూ రాజాసింగ్ ఫైరయ్యారు.
టీటీడీ చైర్మెన్ గా కొత్తగా నియమించబడ్డ బీఆర్ నాయుడు మాట్లాడుతూ టీటీడీలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని అన్నారు. తిరుమలలో పని చేస్తున్న అన్యమతస్థులను డిప్యూటేషన్ మీద ఇతర శాఖలకు బదిలీ చేస్తామని చెప్పారు. బీఆర్ నాయుడు ప్రకటనపై పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లిం వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్ లో హిందువేతరులకు కూడా చోటు కల్పిస్తు బిల్లు తీసుకొస్తున్నారన్నారు. అలాంటి క్రమంలో టీటీడీలో మాత్రం కేవలం హిందువులు మాత్రమే ఉండాలనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. హిందువులకు ఒక న్యాయం, ఇతర మతాలకు ఒక న్యాయమా అంటూ అసద్ మండిపడ్డారు.
టీటీడీ చైర్మెన్ కామెంట్లపై అసద్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రాజాసింగ్. టీటీడీతో వక్ఫ్ బోర్డుకు ముడిపెట్టడం ఏంటని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు వక్ఫ్ బోర్డుకు ఎన్ని ఆస్తులు ఉన్నాయని రాజాసింగ్ ప్రశ్నించారు. వందల, వేల ఎకరాల భూములను వక్ఫ్ పేరిట దోచుకున్నారన్నారు. హిందువుల ఆలయాల భూములు వక్ఫ్ పేరిట కబ్జా చేశారని ఎద్దేవా చేశారు. తిరుమలలో బరాబర్ హిందువులు మాత్రమే విధుల్లో ఉండాలని,, ఉంటారని చెప్పారు. టీటీడీ బోర్డ్ చైర్మన్ బీఆర్ నాయుడుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు రాజాసింగ్.