
బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. రెండు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో జూబ్లీహిల్స్ లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలు ఏదో ఒక పేరుతో జనంలోకి వెళుతున్నాయి. అధికార కాంగ్రెస్ వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను జెట్ స్పీడులో చేపడుతోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సంస్మరణ సభలతో గులాబీ పార్టీ దూకుడు పెంచింది. నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ కమలం పార్టీ కూడా సీన్ లో ఉంటోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ముఖచిత్రం తాజాగా మారుతోంది. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ క్యాండిడేట్‌పై ఇంకా స్పష్టత రాలేదు. అయితే తమ తండ్రి బాటలో నడిచేందుకు మాగంటి గోపీనాథ్ కూతుళ్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు మాగంటి గోపీనాథ్ కూతుళ్లు మాగంటి అక్షర, మాగంటి దిశిర జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు. రహమత్‌నగర్ డివిజన్, శ్రీరామ్‌గర్‌లో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తండ్రి చూపిన మార్గంలో ప్రజలకు సేవ చేస్తామని వారి కష్టాల్లో తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే ఇటీవల గణేష్ నవరాత్రుల్లోనూ అక్షర, దిశిర పలు మండపాలను సందర్శించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. తండ్రి అడుగుజాడల్లో ముందుకు వెళ్తూ నియోజకవర్గ అభివృద్ధిలో అనుక్షణం పాలుపంచుకుంటామని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీఆర్ఎస్ తరఫున వీరు రంగంలోకి దిగితే గెలుపు ఖాయమన్న చర్చ జరుగుతోంది.