తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. మొదటగా సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025 జనవరిలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 2024 జనవరి నెలతోనే సర్పంచ్ ల పదవీ కాలం ముగిసింది. గత 11 నెలలుగా గ్రామాల్లో ఇంచార్జీల పాలన నడుస్తుంది. పంచాయతీ ఎన్నికలు జరగడంతో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు నిలిచిపోతున్నాయి. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవి కాలం కూడా జూలైలోనే ముగిసింది. సర్పంచ్ ఎన్నికలు ముగియగానే పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నారు. అవి ముగిసేసరికి చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవి కాలం ముగియనుంది. దీంతో వాటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిందని తెలుస్తోంది. జనవరిలో మొదలు పెట్టి 6 నెలల్లో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ హామీ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు జరపనుందని సమాచారం. బీసీల రిజర్వేషన్లు పెంచటం కోసమే సమగ్ర కులగణన సర్వే చేపట్టింది ప్రభుత్వం. నవంబర్ నెలాఖరుకు సర్వే పూర్తి కానుంది. సర్వే ముగిసిన వెంటనే.. ఆ లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనుంది కాంగ్రెస్ సర్కార్.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సర్పంచ్ ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. భారీ సంఖ్యలో తన అనుకూల వ్యక్తులను గెలిపించుకునే వ్యూహంలో ఉంది.