వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల గొడవులు ముదిరి పాకాన పడ్డాయి. షర్మిల, విజయమ్మతో జరుగుతున్న వివాదంపై తొలిసారి బహిరంగంగా స్పందించిన మాజీ ముఖ్యమంత్రి జగన్.. అదో చిన్న విషయం అన్నట్లుగా మాట్లాడారు. విజయనగరం జిల్లా గుర్లలో మీడియాతో మాట్లాడిన జగన్.. ఆస్తుల గొడవలు అందరి ఇళ్లలోనే ఉండేవే అన్నారు. ప్రతి ఇంట్లో జరిగే గొడవే తమ ఇంట్లో జరుగుతుందన్నారు. చంద్రబాబు కుటుంబంలో ఆస్తుల గొడవలు లేవా అని జగన్ ప్రశ్నించారు.
జగన్ కామెంట్లపై వెంటనే స్పందించారు వైఎస్ షర్మిల. మా ఉద్దేశ్యం కూడా గొడవలు పెట్టుకోవాలని కాదని చెప్పారు. సామరస్యంగా పరిష్కరించుకోవాలని మాకు తెలుసు.. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని తెలుసు.. కానీ ఇది సామాన్యం అంటూనే,అన్ని కుటుంబాల్లో జరిగేది అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకి ఈడ్చాడు అంటూ ఘాటుగా లేఖ రాశారు. ఇది సామాన్య విషయం కాదు జగన్ సార్ అంటూ 10 ప్రశ్నలతో సుదీర్ఘ లేఖ విడుదల చేశారు వైఎస్ షర్మిల
అన్న జగన్ కు చెల్లె షర్మిల సంధించిన 10 ప్రశ్నలు ఇవే..
1. మీరు ఇటీవల నాకు రాసిన లేఖ పట్ల నేను తీవ్ర మనస్తాపం చెందాను. మన తండ్రిగారు, కీర్తిశేషులు, డా వైఎస్ రాజశేఖరరెడ్డి గారు, తమ జీవితకాలంలో, తమ కుటుంబం ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ తమ ముగ్గురు మనవరాళ్లు, ఒక మనవడికి సమానంగా పంచాలని, నాడు ఎటువంటి సందేహాలకు, గందరగోళానికి తావులేకుండా స్పష్టంగా నిర్దేశించారు. నాడు మీరు, అయన నిర్దేశించిన దానికి కట్టుబడి ఉంటానని ఆయనకు, మాకు మాటిచ్చారు. కానీ అయన మరణం తర్వాత మీరు మాటతప్పారు. అటు భారతి సిమెంట్స్ కావచ్చు, ఇటు సాక్షి కావచ్చు, లేక ఇతరత్రా ఆస్తులు అయన మరణానికి ముందుగా ఉన్నవి కావచ్చు, మన తండ్రిగారు చాలా స్పష్టంగా, ఖచ్చితంగా చెప్పిన విషయం ఏమిటంటే, అయన జీవితకాలంలో ఉన్న ఆస్తులు. తన మనవలకు సమానంగా చెందాలని. మన తండ్రిగారు అత్యంత స్పష్టంగా నిర్దేశించిన వీటన్నిటికీ మన తల్లిగారు కేవలం ఒక సాక్షి మాత్రమే కాదు, ఈ లావాదేవాలన్నిటినీ, ఒప్పందాలన్నిటినీ ఆవిడ నిశితంగా, దగ్గరుండి పరిశీలిస్తూనే ఉన్నారు.
2. మీరు “ప్రేమతో, ఆప్యాయతతో”, నాకు బదిలీ చేశాను అని Memorandum of Understanding (MoU)లో పేర్కొన్న ఆస్తులు, నిజానికి నాడు నాన్నగారు నిర్దేశించి, ఖచ్చితంగా ఇచ్చిన ఆదేశాల్లో పాక్షిక వంతు మాత్రమే నెరవేర్చబడినవి. నేను “పాక్షికం” అనే పదాన్ని ఎందుకు నొక్కివక్కాణిస్తున్నాను అంటే, భారతి సిమెంట్స్, సాక్షి, వీటిలో మీరు పూర్తి వాటా కావాలని అప్పుడు పట్టుబట్టారు. మీరు నామీద పైచేయి సాధించి, దూకుడుగా వ్యవహరించడం వలన, నా మాట చెల్లకపోవడం వలన, నాడు సాక్షి,, భారతి సిమెంట్స్ ఈ విషయంలో MoU లో పొందుపరిచిన వాటికీ నేను అంగీకరించవలసి వచ్చింది. మీరు నాకు సోదరులవటం వలన, అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాలు కుటుంబ పరిధిలోనే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే సదుద్దేశంతో వీటిలో నా సమాన హక్కును వదులుకోవడానికి నాడు నేను సిద్ధపడ్డాను, సమ్మతించాను.
3. ఇప్పుడు, మీరు సొంత తల్లి మీద కేసు వేసి, ఆవిడను కోర్టుకు లాగుతూ, సొంత చెల్లెలికి, ఆమె పిల్లలకు న్యాయబద్దంగా, MoU ప్రకారం రావాల్సిన ఆస్తులను వారికి దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. మన తండ్రిగారు చూపిన న్యాయమార్గం, ధర్మాన్ని అనుసరించకపోవటం, వీటన్నిటినీ తుంగలోతొక్కి, మీరు దారితప్పడం చాలా బాధాకరం, ఆక్షేపణీయం.
4. మన తండ్రిగారి ఆదేశాలకు, కాంక్షలకు వ్యతిరేకంగా, అయన నిర్దేశించినవాటికి ఎదురుతిరిగినట్టుగా, ఏకపక్షముగా MoUను మీరు రద్దు చేసుకోవటానికి ఉద్యుక్తులయ్యారు. న్యాయపరంగా మీ లేఖ MoUకు వ్యతిరేకంగా ఉంది, దానికి ఎటువంటి చట్టబద్దమైన పవిత్రత లేదు, కానీ దీనికంటే అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ లేఖలోని సారాంశం ద్వారా మీరు స్పష్టం చేసిన మీ ఉద్దేశం. మన తండ్రిగారి ప్రతి ఆదర్శం, విలువలను, ఉద్దేశాలను మీరు ఏ విధంగా అవమానించారో, అణగదొక్కారో ఈ లేఖ అద్దం పడుతోంది. తాను ప్రాణప్రదంగా ప్రేమించి గౌరవించిన తన జీవిత భాగస్వామిపై, తనకు ప్రాణప్రదమైన కుమార్తె, వీరిరువురిపై, తన సొంత కుమారుడే కోర్టు వెళతాడని అయన ఎప్పటికి ఊహించి ఉండరు. వారికి న్యాయబద్దంగా, ధర్మబద్ధంగా రావాల్సిన ఆస్తులను వారికి చెందకుండా చేస్తాడని కలలో కూడా అనుకుని ఉండరు.
5. ఇక MoU ప్రకారం నా వాటాగా నిర్ణియించబడిన సరస్వతి పవర్ విషయానికి వస్తే, నాడు మీరు MoU సంతకం చేసిన వెనువెంటనే 100% వాటాను నాకు బదలాయిస్తానని ప్రమాణం చేసారు. కానీ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా మీరు మీరిచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మీరు ఈ విషయంలో నిస్సందేహంగా విఫలమయ్యారు. పైపెచ్చు మన తల్లిగారు, క్లాసిక్, సండూర్ లకు చెందిన సరస్వతి షేర్లు కొనుగోలు చేసిన తరవాత, అటుపై మీరు మిగిలిన వాటాలు ‘గిఫ్టుగా’ ఇచ్చిన తర్వాత – మీరు, మీ ధర్మపత్ని గిఫ్ట్ డీడ్ లో సంతకాలు చేసిన, ఫోలియో నంబర్లతో కూడిన గిఫ్ట్ డీడ్ ప్రకారం – ఇపుడు మీరు బీదార్పులు అరుస్తూ, ఇదేదో పెద్ద నేరమని చెప్పటం సరికాదు. మీరు పూర్తి హక్కులు ఇస్తూ గిఫ్ట్ డీడ్ సంతకం చేసారు, మన తల్లిగారికి సరస్వతి పవర్లో పూర్తి వాటాలు ఇచ్చారు.
6. నాడు వాటాలు ఇవ్వడానికి రాతపూర్వకంగా ఒప్పుకుని, ఇప్పుడు అర్థరహితంగా,ఉద్దేశపూర్వకంగా గొడవలు రేపుతూ, మీరు NCLT కోర్టుకు కుటుంబాన్ని ఈడ్చే ప్రయత్నం చేయటం చాలా దారుణం. ఇది కేవలం సరస్వతి పవర్ లో నాకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా నాకు రాకుండా అడ్డుకోవడానికి చేస్తున్న కుటిల ప్రయత్నం.
7. ఇక MoU విషయానికి వస్తే ఇది అత్యంత విలువగల పత్రం, దీని ప్రకారం మనం నడుచుకోవాల్సిందే. మీరు నేడు ఏకపక్షంగా దీనిని రద్దుచేసే ప్రయత్నం చేస్తే ఆ చర్యకు న్యాయపరంగా ఎటువంటి విలువ, ప్రాముఖ్యత ఉండవు. ఈ ప్రకారంగా MoUలో పేర్కొనబడిన ప్రతి ఆస్తికి, వాటికి సంబంధించి చేసుకున్న ఒప్పందాలకు, 20 ఎకరాల్లో ఉన్న యెలహంక ప్రాపర్టీ కూడా, సుస్పష్టంగా MoU లో పేర్కొనబడకపోయినా కూడా, మౌఖికంగా అంగీకరించిన వాటికి, దేనికైతే మన తల్లిగారు సాక్షిగా ఉన్నారో, ఈ ఒప్పందాలు, terms & conditions, అన్నీ సక్రమంగా న్యాయబద్ధంగా ఉండేలా చూడటం మీ నైతిక, ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన బాధ్యత అని నేను మీకు గుర్తుచేస్తున్నాను.
8. నా రాజకీయ నిర్ణయాలు నా వ్యక్తిగతం, వాటిని శాసించే హక్కు, అధికారం మీకు లేవు. మీకు, అవినాష్ కు వ్యతిరేకంగా, ప్రజా వేదికలపై నేను మాట్లాడకుండా ఉండాలని, దీనికి బద్దురాలినై నేను ఒప్పందం కుదుర్చుకోవాలని మీరు చెప్పటం అత్యంత దారుణం. మాకు విరుద్ధంగా, సెటిల్మెంట్ కోసం ఈ షరతు విధించటం పూర్తిగా అసంబద్ధం, అన్యాయం.
9. నాన్నగారు నాడు ఇచ్చిన ఆదేశాలకు, అయన జీవితకాలంలో ఉన్న ఆస్తులన్నీ అయన మనవలందరికీ సమానంగా చెందాలని చేసిన నిర్దేశన, వీటిపై నా రాజకీయ నిర్ణయాల వలన ఎటువంటి ప్రభావాలు ఉండరాదు. ఒక రక్తం పంచుకుని పుట్టిన అన్నాచెల్లెళ్లుగా, నా పట్ల, నా పిల్లలపట్ల మీకు కూడా నైతిక బాధ్యత ఉంది అని మీరు మర్చిపోకూడదు. ఆ బాధ్యత నిర్వర్తించే విధంగా మీరు MoU ను గౌరవించి, అమలు పరిచేలా చూడాలి. ఇదే న్యాయం, ఇదే ధర్మం.
10. నేడు నా ప్రార్థన, కాంక్ష ఒకటే. నైతికంగా మీరు ఎంత దిగజారి, ఎటువంటి లోతుల్లో కూరుకుపోయారో, అందులోంచి బయటకు వచ్చి, మన తండ్రిగారి ఆశలను, ఆదేశాలను, MoU కు కట్టుబడి పాటించాలి. మీరు కనుక ఇది చేయలేని నాడు, ధర్మానికి కట్టుబడకపోతే, న్యాయపరంగా దీన్ని ఎలా ఎదుర్కోవాలో, దీనికి విరుగుడు ఏమిటో నాకు తెలియనిది కాదు, చట్టపరంగా తగిన చర్యలకు నేను ఉపక్రమించాల్సి వస్తుంది, ఈ హక్కు నాకుంది. ఈ లేఖలో నేను పేర్కొన్న అంశాలు, పొందుపరిచిన విషయాలు, ఇవన్నీ సత్యాలని, వీటిలో ఉన్న ఖచ్చితత్వాన్ని ప్రమాణీకరించే విధంగా, నాడు, నేడు, మన ఒప్పందాన్నిటికీ సాక్ష్యంగా ఉన్న మన తల్లిగారు కూడా ఈ లేఖలో తమ సంతకాన్ని పెట్టారు.