ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్స్ సీజన్ నడుస్తోంది. ప్రతిపక్ష వైసీపీ పార్టీ నుంచి కీలక నేతలంతా జంప్ కొడుతున్నారు. వైఎస్ జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో ఆయన సమావేశం కూడా జరిగింది. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను కూడా పవన్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారని తెలుస్తోంది. వీళ్లిద్దరితో పాటు మరికొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు జనసేన లేదా టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి.
వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాం రెడ్డి కూడా జనసేనలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేతిరెడ్డి జంపింగ్ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.అయితే తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాం రెడ్డి. జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారతారు అన్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి.. తాను పార్టీ మారడం లేదని తెలిపారు. సొంత పార్టీ నేతలే తనపై దుష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు.
35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నామని.. ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తామని కేతిరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ వెంటే ఉంటానన్నారు కేతిరెడ్డి వెంకట్రాం రెడ్డి. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. నమ్ముకున్న వారి కోసమే రాజకీయాలు చేస్తున్నానని కేతిరెడ్డి ఫేస్ బుక్ లో వీడియో పోస్ట్ చేశారు.