
దేశ రాజకీయాల్లో కీలక పరిణామం జరుగుతోంది. విపక్ష ఇండి కూటమిలో లుకలుకలు తీవ్రమ్యయాయి. ఎన్డీఏకు పోటీగా ఏర్పడిన ఇండి కూటమి చీలిక దిశగా వెళుతోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలతో విపక్ష ‘ఇండియా’ కూటమిలో చీలిక అనివర్యంగా కనిపిస్తోంది. ఇండియా కూటమి నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ నాయక్తవానికి దేశంలోని కాంగ్రెస్ యేతర నేతల మద్దతు పెరుగుతోంది.
కాంగ్రెస్‌కు గట్టి గా మద్దతు పలుకుతున్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ సైతం తాజాగా ఈ జాబితాలో చేరారు. ఎన్నికల్లో బెంగాల్‌కు వెలుపల గోవా, త్రిపుర, మేఘాలయ, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ వంటి రాష్ట్రాల్లో టీఎంసీ ప్రభావం పెద్దగా ఏమీలేదంటున్న కాంగ్రెస్ అభ్యంతరాన్ని లాలూ తోసిపుచ్చారు. ఇండియా కూటమిని మమత నడపగలదు. ఆమెకు నాయకత్వం ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు.
లోక్‌సభ ఎన్నికల్లో తన ప్రదర్శనతో ఆకట్టుకొన్న ఇండియా కూటమి ఆ తర్వాత జరిగిన హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోరంగా విఫలమవడంతో నాయకత్వ మార్పుపై భాగస్వాముల దృష్టి మళ్లింది. ఈ నేపథ్యంలో అవకాశమొస్తే ఇండియా కూటమిని నడపడానికి తాను సిద్ధమని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ శివసేన ఉద్ధవ్ గ్రూప్ నేతలు ఆమెకు మద్దతుగా గళం విప్పారు. లాలూ తనయుడైన ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ సైతం మమత సారథ్యంపై ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.
కాంగ్రెస్ వైదిలిగితే ఇండియా కూటమిలో కొత్త పార్టీలు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా BJP తో సన్నిహితంగా మెలిగిన వైఎస్‌ఆర్‌సీపీ సైతం మమత నాయకత్వానికి మద్దతు ప్రకటిస్తోంది. 42 లోక్‌సభ స్థానాలున్న పెద్ద రాష్ట్రానికి సీఎంగా ఉన్న దీదీ ఇండియా కూటమిని నడపడానికి సరైన వ్యక్తి అని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక బీఆర్ఎస్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండి కూటమిలోని కీలక నేతలపై మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, ఒమర్ అబ్దుల్లా, స్టాలిన్, హేమంత్ సోరెన్ తో కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ బయటికి పోతే ఇండి కూటమిలోకి రావడానికి తమకు అభ్యంతరం లేదనే సందేశం ఇప్పటికే గులాబీ బాస్ ఇచ్చారంటున్నారు.