తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబే మొదటి ముద్దాయి అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.ఇది కచ్చితంగా ప్రభుత్వ తప్పిదమని.. సీఎం సహా టీటీడీ ఛైర్మన్, అధికారులు, జిల్లా ఎస్పీ, కలెక్టర్ అందరూ ఘటనకు బాధ్యులే అన్నారు. వీరందరిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. గాయపడిన వారికి మంచి వైద్యం అందించడతో పాటు రూ.5 లక్షల సాయం అందించాలన్నారు జగన్.
తొక్కిసలాట ఘటనను తక్కువ చేసి చూపుతూ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ మార్చాలని జగన్ డిమాండ్ చేశారు.
క్రిమినల్ కేసులు కాకుండా ప్రమాదవశాత్తు జరిగినట్టు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు..అందుకే బీఎన్‌ఎస్ సెక్షన్–194 బదులు సెక్షన్–105 నమోదు చేయాలని అన్నారు. చంద్రబాబుకు దేవుడంటే భయమూ లేదూ భక్తీ లేదన్నారు జగన్.
అందుకే శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపైనా దుష్ప్రచారం చేశారని.. సీఎం చంద్రబాబు వైఫల్యం వల్లే ఇప్పుడు ఈ దారుణం జరిగిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్. ఈ పాపం ఊరికే పోదు అన్నారు. చంద్రబాబు సహా బాధ్యులందరికీ దేవుడి మెట్టికాయలు ఖాయమన్నారు.
రాష్ట్ర చరిత్రలో తిరుపతిలో ఎప్పుడూ తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోయిన ఘటన గతంలో మనం ఎప్పుడూ చూడలేదన్నారు జగన్. ఈరోజు ఇలాంటి పరిస్థితులకు దారితీసిన కారణాలు ఏంటన్నది అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటన ఎందుకు జరిగింది. ఘటన జరగడానికి కారణాలు ఏంటన్నది ఆలోచన చేయాలని సూచించారు. ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు కొన్ని లక్షల మంది వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తారని అన్నారు. లక్షల మంది దర్శనానికి వస్తారని తెలిసినప్పటికీ టీటీడీలో ఎందుకు ప్రోటోకాల్స్ పాటించలేదని జగన్ నిలదీశారు.
తిరుపతి, బైరాగిపట్టెడ కౌంటర్ ఎదురుగా పార్కులో ఉదయం 9 గం. నుంచి భక్తులను ఉంచారు. రాత్రి 8.30 గం.కు పార్కు గేట్లు తెరిచి కౌంటర్లు దగ్గర వెళ్లడానికి గేట్లు తెరిచారు. చీకట్లో అందరూ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. పార్కులో ఉంచినప్పుడు వారికి ఏ సౌకర్యాలు కల్పించలేదు. భక్తులు వచ్చిన వెంటనే వాళ్లను క్యూ లైన్లో నిల్చోబెట్టి, తగినంత పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. కానీ అలా చేయలేదు. ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టడానికి పోలీసులు అందుబాటులో లేకపోవడంతో పాటు భక్తులందరినీ గుంపుగా ఉంచి.. ఒకేసారి విడిచిపెట్టడంతో ఈ ఘటనలు జరిగాయి.
చంద్రబాబునాయుడు ఎంత దిక్కుమాలిన అబద్దాలు ఆడుతున్నారంటే.. ఒకే ఒక్క చోట తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీలు చూస్తే.. విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారని, బైరాగిపట్టెడిలో ఐదుగురు చనిపోయినట్టు మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆస్పత్రిలో చూస్తే.. అన్ని కౌంటర్లలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కనిపిస్తున్నారు.