ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుపైకి దాడికి యత్నం.. పోలీసుల అప్రమత్తతో తప్పిన ముప్పు

క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో ఊహించని పరిణామం జరిగింది. పోలీసులను పరుగులు పెట్టించింది. టీడీపీ నేతలను కాసేపు కంగారు పెట్టింది. ముప్పు తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఈ ఘటనతో చంద్రబాబు భద్రతా వైఫల్యం కనిపించింది.

ఏపీలో శుక్రవారం ప్రభుత్వం గ్రామసభలను నిర్వహించింది. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్లి జనంతో మమేకమయ్యారు. సీఎం చంద్రబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లి గ్రామ సభకు హాజరయ్యారు. సభకు చంద్రబాబు వస్తున్న సమయంలో కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలనే డిమాండ్‌తో ఆందోళన చేపట్టారు. మాల సంఘాల ప్రతినిధులు కొందరు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యపై చంద్రబాబును నిలదీశారు. తమకు మద్దతుగా నిలవాలని నినాదాలు చేశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.

నినాదాలు చేస్తున్న యువకులు ఒక్కసారిగా చంద్రబాబు మీదకు దూసుకువచ్చారు. దీంతో బందోబస్తులో ఉన్న పోలీసులు ఖంగు తిన్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకోవడంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. నిరసనకారులను సభ నుంచి బలవంతంగా బయటికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన అక్కడున్న పోలీసు అధికారులతో పాటు టీడీపీ నేతలను ఉలిక్కిపడేలా చేసింది.

 

Back to top button