మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టుల చరిత్రలోనే జరిగిన అతిపెద్ద ఎన్ కౌంటర్ లో అగ్రనేతలను కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ అబూజ్ మడ్ ఏరియాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పాటిలింగం తెలిపారు. వీరిలో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని చెప్పారు.మావోయిస్టులను గుర్తిస్తున్నామని చెప్పారు.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ – దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమయ్యారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్ – కోబ్రా, ఎస్‌టీవో బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయని చెప్పారు. నారాయణ్‌పూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండూర్ – తులతులీ గ్రామల మధ్య గల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో రెండు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. మృతులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 6వ కంపెనీ, తూర్పు బస్తర్ డివిజన్‌కి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో 25 లక్షల రూపాయలు రివార్డున్న దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, తూర్పు బస్తర్ డివిజన్ ఇన్‌చార్జి నీతి అలియాస్ ఊర్మిల ఉన్నారు. ఆమెతో పాటు డివిజినల్ కమిటీ సభ్యులు సురేశ్ సలాం, మీనా మడకం ఉన్నారు. ఇప్పటివరకు గుర్తించిన మృతులపై 1.30 కోట్ల రివార్డు ఉందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.
అయితే ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల్లో అగ్రనేత సంబావ కేశవరావు అలియాస్ ఆశన్న ఉన్నారని తెలుస్తోంది. ఆశన్న ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మావోయిస్టు టాప్ ముగ్గురు నేతల్లో ఆయన ఒకరు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై అలిపిరిలో జరిగిన బాంబు దాడిలో ప్రధాన సూత్రదారి ఆశన్నే. అప్పటి నుంచి ఆశన్న కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆశన్న హతమైనట్లు పోలీసులు ఇంకా దృవీకరించలేదు. పౌరహక్కుల సంఘం నేతలు మాత్రం ఎన్ కౌంటర్ లో చనిపోయిన వారిలో ఆశన్న ఉన్నారంటున్నారు. ఆశన్న టార్గెట్ గానే ఆర్మీ ఈ ఆపరేషన్ చేసిందని చెబుతున్నారు. ఆశన్న చనిపోతే అది మావోయిస్టులకు పెద్ద దెబ్బే.