తెలంగాణలో గ్రూప్ వన్ అభ్యర్థులు వారం రోజులుగా తీవ్ర పోరాటం చేస్తున్నారు. సోమవారం నుంచి జరగాల్సిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రోజుకో రీతిలో ఆందోళన చేస్తున్నారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో అశోక్ నగర్ అట్టుడికిపోతోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా ఆందోళనలో పాల్గొనడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.
గ్రూప్-1 అభ్యర్థుల నిరసనలతో హైదరాబాద్ అట్టుడికిపోతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రూప్స్ అభ్యర్థుల డిమాండ్లు, జీవో 29 రద్దుపై మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చలకు మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖలతో పాటు కాంగ్రెస్ పీసీసీ ఛీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అర్థరాత్రి వరకు మంత్రుల సమావేశం జరిగింది. గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
శనివారం పోలీస్ మీట్ లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పారు. పరీక్ష వాయిదా పడితే విద్యార్థులకే నష్టమన్నారు. సీఎం ప్రకటన తర్వాత రాత్రి మంత్రులు సమావేశం కావడం చర్చగా మారింది. జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆ వర్గానికి చెందిన మంత్రులపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీ, ఎస్సీ మంత్రులు సమావేశం అయ్యారని తెలుస్తోంది. గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లు, జీవో 29 రద్దుపై మంత్రులుకీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై గ్రూప్-1 అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.