తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి ఆధిపత్య పోరు సాగింది. పీసీసీ చీఫ్ తో పాటు మంత్రివర్గ పోస్టులపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వార్ సాగింది. పార్టీ పెద్దలతో చర్చోపచర్చల అనంతరం పీసీసీ చీఫ్ గా క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. పీసీసీ పదవిని బీసీకి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించడంతో.. మధుయాష్కీ గౌడ్ , మహేశ్ కుమార్ గౌడ్ చివరి వరకు పోటీ పడ్డారు. మహేష్ కుమార్ కోసం రేవంత్ పట్టుబట్టగా.. మధుయాష్కీ ఇవ్వాలని భట్టి. ఉత్తమ్ ప్రతిపాదించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఛాయిస్ తో మహేష్ కుమార్ గౌడ్ కు ఖరారు చేశారని టాక్.
కేబినెట్ లో భర్తీ చేయాల్సిన ఆరుగురు మంత్రులకు సంబంధించి హైకమాండ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సామాజీక సమీకరణాల్లో భాగంగా ఫైనల్ చేశారని సమాచారం. రేవంత్ కేబినెట్ లో ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ జిల్లాల నుంచి ఈసారి అవకాశం కల్పించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుకు.. నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి వైపు మొగ్గు చూపారని టాక్. రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి రేసులో ఉన్నా.. మల్ రెడ్డికి ఖరారైందని సమాచారం.హైదరాబాద్ జిల్లా కోటాలో ఎమ్మెల్సీ కోదండరాంను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇక బీసీ కోటాలో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు ఖాయమైందని చెబుతున్నారు. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. భువనగిరి లోక్ సభ సీటు గెలిపిస్తే కేబినెట్ లోకి తీసుకుంటామని తనకు హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి చెబుతూ వచ్చారు. తనకు మంత్రి పదవి ఖాయమని అనుచరులకు కూడా కోమటిరెడ్డి చెప్పారు. కాని ఆయన మంత్రిపదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెక్ పెట్టారని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సి వస్తే తన భార్య పద్మావతికి ఇవ్వాలని ఉత్తమ్ అన్నారని టాక్. గతంలో ఉతమ్ ను కోమటిరెడ్డి బ్రదర్స్ టార్గెట్ చేశారు. ఇప్పటికే వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి వస్తే జిల్లాలో తాను జీరో అవుతానని ఉత్తమ్ భయపడ్డారని అంటున్నారు. అందుకే ఢిల్లీలో తన పలుకుబడి ఉపయోగించి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని చెబుతున్నారు. తనకు పదవి రాకుండా ఉత్తమ్ అడ్డుకున్నారని కోమటిరెడ్డి రగిలిపోతున్నారని తెలుస్తోంది. ఉత్తమ్ తో తాడోపేడో తేల్చుకుంటామని కోమటిరెడ్డి బ్రదర్స్ ఆగ్రహం ఉన్నారంటున్నారు.