తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి నివాళి అర్పించేందుకు పార్టీలకు అతీతంగా నేతలు తరలివస్తున్నారు. ఉద్యమ నేతను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు భారీగా వచ్చారు. జిట్టాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కొందరు ఉద్యమకారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. జిట్టాకు నివాళి అర్పించేందుకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. జిట్టా అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలంటూ మంత్రి కారును అడ్డుకున్నారు. పోలీసులు నిరసనకారులను పక్కకు తప్పించి కోమటిరెడ్డిని జిట్టా భౌతికకాయం దగ్గరకు తీసుకువెళ్లారు.
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతితో ఆయన స్వస్థలం భువనగిరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. జిట్టాకు నివాళి అర్పించేందుకు ఆయన అభిమానులు..పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. భువనగిరిలోని అమరవీరుల స్థూపం దగ్గర జిట్టాకు నివాళి అర్పించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిట్టా బాలకృష్ణారెడ్డి మృతదేహానికి పూలమాలు వేసి అంజలి ఘటించారు. తెలంగాణ కోసం తన ఆస్తులను అమ్మి ఖర్చు చేశారని ఆయన సహచరులు చెప్పారు. జిట్టా అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలంటూ నినాదాలు చేశారు.