క్రైమ్ మిర్రర్, షాద్ నగర్ ప్రతినిది : ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చతికిల పడిందని, ఇచ్చిన హామీలు నెరవేరే విధంగా బీఆర్ఎస్ రైతుల పక్షాన రేవంత్ రెడ్డి మెడలు వంచుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్ పోరు బాటపట్టింది. రేవంత్ సర్కార్ మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టినట్టు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో పార్టీ శ్రేణులతో కలసి కదంతొక్కినట్టు ఆయన పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని, అదేవిధంగా 6 గ్యారంటీలు కూడా అమలు చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన కొడంగల్ నియోజకవర్గంలోనే 52,000 మంది రైతులకు గాను కేవలం 17 వేల మందికి రైతులకు మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయని విమర్శించారు. చెప్పేదొకటి చేసేది ఒకటి అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో ప్రభుత్వం అమలు చేసే వరకు వెంట పడుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో రైతులకు చాలామందికి రుణమాఫీ జరగలేదని అన్నారు. ఎక్కడి నుండో రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి కొడంగల్ లో పోటీ చేసి ఎమ్మెల్యేగా పలుమార్లు గెలుపొందారని, ఇక్కడి ప్రజలు ఆయనకు అండగా ఉంటే ఆయన మాత్రం ప్రజల వెంట లేరని అన్నారు.
Read More : నల్లవెల్లి రెవెన్యూ పరిధి మాల్ లో నీకు ఈ ప్లాట్లు ఎక్కడివి రవీందర్?
ఆయన సొంత నియోజకవర్గంలోనే రుణమాఫీ పరిస్థితి ఘోరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని సూచించారు. ఈ సందర్భంగా రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలు చేస్తున్న అని చెప్పి చేయకపోవడం తీరుపట్ల స్థానిక పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ రుణమాఫీ ధర్నాలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.