హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాడు. తన వైఖరికి భిన్నంగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబును గత రెండు దశాబ్దాలుగా వ్యతిరేకిస్తున్నారు ఎంపీ అసద్. వైఎస్సా రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు అసద్. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన తనయుడు జగన్ కు మద్దతుగా నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో ఏపీకి సంబంధించి బహిరంగంగానే జగన్ కు సపోర్ట్ చేశారు ఒవైసీ. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జగన్ ను గెలిపించాలని ఏపీ ఓటర్లకు పిలుపిచ్చారు. గత 20 ఏళ్లుగా సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబును టార్గెట్ చేస్తూ వచ్చారు అసదుద్దీన్ ఒవైసీ.
చంద్రబాబుకు బద్ద వ్యతిరేకిగా ఉన్న ఎంపీ అసద్.. తాజాగా యూ టర్న్ తీసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును సమర్థిస్తూ మాట్లాడారు. ఎక్కువ మంది సంతానం ఉండాలన్న సీఎం చంద్రబాబు నాయుడు మాటలు కరెక్టే అన్నారు అసద్. జనాభా ప్రకారం నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గి దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని తెలిపారు. దక్షిణాదిలో జననాల రేటు తక్కువగా ఉంది.. ఎక్కువ సంతానం కలగాలని చంద్రబాబు, స్టాలిన్ అంటున్నారని అన్నారు. ఇదే విషయం తాను చెబుతున్నానని చెప్పారు. అయితే చంద్రబాబు, స్టాలిన్ ను తప్పపట్టకుండా.. తాను ఇదే మాట నేనంటే రాద్ధాంతం ఎందుకని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
మరోవైపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు ఎంపీ అసద్. గత పదేళ్లలో బీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్నారు. కాని ఇప్పుడు కేసీఆర్ విషయంలోనూ రూట్ మార్చారు అసదుద్దీన్ ఒవైసీ. బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. అహంకారం వల్లే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు అసద్. మజ్లిస్ వల్లే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సీట్లు గెలిచిందన్నారు. మూసీపై కేటీఆర్ సహా గులాబీ నేతలు షో చేస్తున్నారన్న అసద్.. పదేళ్లలో మూసీ సుందీరకరణ ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. తాము నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేరన్నారు అసద్.