తెలంగాణ

కేబినెట్ లోకి రాజగోపాల్ రెడ్డి!ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ సిగ్నల్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా హస్తినకు వెళుతున్నారు. ఇటీవలే పీసీసీకి కొత్త సారధిని నియమించింది హైకమాండ్. తాజాగా రేవంత్, భట్టి విక్రమార్కను ఢిల్లీకి పిలవడంతో చాలా కాలంగా వెయిటింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించడానికేనని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు మంత్రిపదవులు ఖాళీగా ఉన్నాయి. కేబినెట్ బెర్తులను ఖరారు చేయడానికే రేవంత్, భట్టిని ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది.

మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చోటు లేదు. మైనార్టీలకు, బీసీలో కొన్ని వర్గాలకు అవకాశం దక్కలేదు. అన్ని జిల్లాలను కవర్ చేసేలా.. అన్ని సామాజికవర్గాలను సంతృప్తి పరిచేలా కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఛాన్స్ దక్కని జిల్లాలకు అవకాశం కల్పిస్తూనే కొన్ని సంచలన నిర్ణయాలు ఉంటాయని సమాచారం.

Read More : రేవంత్‌కు దండం పెట్టిన వీహెచ్.. గాంధీభవన్ లో అంతా షాక్

ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ సోదరులతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు రేసులో ఉన్నారు. అయితే ప్రేంసాగర్ రావుకు కేబినెట్ బెర్త్ దక్కనుందనే సంకేతం ఇటీవల ఇచ్చారు సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు. దీంతో వివేకా సోదరులకు నిరాశ తప్పదని తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి.. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ ఆశిస్తున్నారు. వీరిలో ఒకరికి చోటు ఖాయంగా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రాంమోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి కోదండరాం పేరు వినిపిస్తున్నా .. సామాజిక కోణంలో కష్టమేననే అభిప్రాయం తాజాగా వస్తోంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. జిల్లా నుంచి మరోకరికి అవకాశం వస్తుందంటున్నారు. బీసీ కోటాలో శ్రీహరి ముదిరాజ్, వీర్నపల్లి శంకర్ రేసులో ఉండగా.. రెండు రోజుల క్రితమే అసెంబ్లీ కమిటీకి చైర్మెన్ గా శంకర్ ను నియమించారు. దీంతో శ్రీహరి ముదిరాజ్ కు కేబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు. శ్రీహరికి ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే మద్దతు ఉందని తెలుస్తోంది.

Read More : రేవంత్‌కు మల్లారెడ్డి దిమ్మతిరిగే షాక్.. వామ్మో మాములోడు కాదుగా..

ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రిపదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భువనగిరి ఎంపీ సీటును గెలిపిస్తే కేబినెట్ లోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారనే టాక్ ఉంది. నల్గొండ జిల్లా నుంచే రాజగోపాల్ రెడ్డికి పోటీగా పద్మావతి రెడ్డి మంత్రిపదవి ఆశించారు. అయితే ఉత్తమ్ పద్మావతికి అసెంబ్లీ కమిటి చైర్మెన్ పదవిని కట్టబెట్టారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనే యోచనతోనే పద్మావతి రెడ్డికి ఆ పదవి ఇచ్చారని చెబుతున్నారు. మంత్రిపదవి ఖాయమైందని రాజగోపాల్ రెడ్డికి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సిగ్నల్ ఇచ్చారని సమాచారం. రేవంత్ సిగ్నల్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు సంబరాలు కూడా చేసుకుంటున్నారట.

Spread the love
Back to top button