వరద విలయం నుంచి ఆంధ్రప్రదేశ్ క్రమంగా కోలుకుంటోంది. వరద తగ్గడంతో విజయవాడలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నగరంలో ఇంకా వందలాది కాలనీలు నీటిలో ఉన్నాయి. వరద బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. జనాల్లో వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు ఇదే సమయంలో కొందరు కాసుల కక్కర్తికి తెర తీశారు. వరద బాధితులను నిలువు దోపిడి చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఐతవరంలో కొందరు బరి తెగించారు. వరదల్లో మునిగిన వాహనాలను వెలికి తీయడానికి భారీగా డబ్బులు వసూల్ చేస్తున్నారు.
కారుకు 20వేలు, టూవీలర్‌కు పదివేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. బహిరంగంగానే వాహనాలను వరద నుంచి బయటికి తీసేందుకు వసూళ్ల దందాకు దిగారు.వరద నీటిలో కొట్టుకువచ్చిన వాహనాలను తీసేందుకు డబ్బులు డిమాండ్ చేయడంపై వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
నందిగామలో వందల సంఖ్యలో మట్టిలో కూరుకుపోయిన వాహనాలు బయటపడుతున్నాయి. ఇందులో కార్లు, బైకులు ఉన్నాయి. వరదనీటిలో కొట్టుకుపోయిన వాహనాలను బయటకు తీసేందుకు టోల్‌గేట్ యాజమాన్యం ముందుకు రాలేదు. రోడ్డు కోతకు గురైన చోట సహాయక చర్యలు చేపట్టకుండా కీసర టోల్‌గేట్ సిబ్బంది టోల్ వసూలు చేస్తుండటంపై వాహనదారులు మండిపడుతున్నారు. జాతీయ రహదారిపై వందకుపైగా వాహనాలు కిలోమీటర్ మేర కొట్టుకుపోయాయి. తమ వాహనాల్లో ఉన్న లగేజ్, డబ్బు, బంగారం దొంగిలించారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.