
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర సంచలనంగా మారింది. బెంగళూరులోని HSR లేఅవుట్‌లోని తన నివాసంలో ఆయన హత్యకు ఉగరయ్యారు. నిన్న మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా… ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ హత్యకు, కుటుంబ తగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య పల్లవిని అన్ని కోణాల్లో విచారించారు పోలీసులు.
కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి, ఇతర కుటుంబ సభ్యులతో ఓం ప్రకాశ్ గొడవ పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల ఆయన ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగిన ఉదంతం మాధ్యమాల్లో ప్రసారమైంది. ‘ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్’లోనూ తన భర్త ప్రకాశ్.. కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసిస్తున్నారని, ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నారని పల్లవి మెసేజ్‌లు పోస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్’ అంటూ ఫోనులో మెసేజ్ పెట్టారు. డీజీపీ అలోక్ మోహన్, బెంగళూరు నగర కమిషనర్ బి.దయానంద్ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మృతుడి భార్య పల్లవి, కుమార్తె, కోడళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.