క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : అక్రమ కట్టడాలు కూల్చేస్తున్న హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఓవైసీ బ్రదర్స్ అనే చర్చ జోరుగా సాగుతోంది. ఒవైసీ బ్రదర్స్ కు సంబంధించిన అక్రమ కట్టడాలపై హైడ్రా కు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఎక్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి పిర్యాదు చేశారు పాతబస్తీ వాసులు. బండ్లగుడా సలకం చెరువులో ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా విద్యాసంస్థలు నిర్మించారని ఫిర్యాదు చేశారు. చెరువు సగం ఆక్రమించి ఫాతిమా విద్యాసంస్థలు నిర్మించారని అసద్ పై ఆరోపణలు ఉన్నాయి. చెరువులోనే బిల్డింగులు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదని ఎక్స్ లో సీఎం రేవంత్ ను ప్రశ్నిస్తున్నారు పాతబస్తీ జనాలు. హైడ్రాకు భారీగా ఫిర్యాదులు వస్తుండటంతో సలకం చెరువులో కట్టిన నిర్మాణాలను కూల్చేస్తారనే ప్రచారం సాగుతోంది. తమ భవనాలను కూల్చివేస్తారనే భయంతోనే హైడ్రాకు వ్యతిరేకంగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారని అంటున్నారు.
హైడ్రా కూల్చివేతలపై స్పందించారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు.. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.నెక్లెస్‌రోడ్ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందన్నారు అసద్. నెక్లెస్‌రోడ్‌ను కూడా తొలగిస్తారా అని నిలదీశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేదని.. మరి జీహెచ్‌ఎంసీ కార్యాలయం పరిస్థితేంటి అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.