మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ చర్యలకు పౌరసరఫరాల శాఖ ఆదేశించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పేర్ని నానికి చెందిన గోదాములో నిల్వ చేసిన దాదాపు 90లక్షల రూపాయల విలువైన రేషన్ బియ్యం గల్లంతయ్యాయి. దీనిపై సమగ్ర విచారణ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండీ మన్‌జీర్ జిలానీ ఆదేశాలు జారీ చేశారు. బియ్యం గల్లంతుపై లెక్కలు తేల్చి రెట్టింపు జరిమానా, గోదాముల యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారం నాని దాదాపు రూ.1.80 కోట్లు జరిమానా చెల్లించడంతోపాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన దాదాపు 40 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా పౌరసరఫరాల సంస్థ 2020లో వైసీపీ హయాంలో అద్దెకు తీసుకుంది. బస్తాకు నెలకు 5 రూపాయల వరకు అద్దె చెల్లిస్తోంది. దీన్ని బఫర్ – ఇన్వెస్టర్ గోదాములుగా వినియోగిస్తుంది. ఇక్కడ నిర్వహణ అంతా ప్రైవేటు యాజమాన్యం తీసుకుంటుంది. కేవలం పర్యవేక్షణ మాత్రం పౌరసరఫరాల సంస్థ చూస్తుంది. గోదాముల యజమాని ఆధ్వర్యంలోనే మేనేజర్, ఇతర సిబ్బంది ఉంటారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా మేనేజరు ఎప్పటికప్పుడు నిల్వలు పరిశీలించాల్సి ఉంటుంది.
తమ గోదాములో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని, దాదాపు 3వేల 200 బస్తాలు తరుగు ఉన్నాయని… ఆ మేరకు తాము సొమ్ములు చెల్లించేందుకు సిద్ధమంటూ గత నెల 27న పేర్ని నాని జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మకు లేఖ రాశారు. దీంతో అధికారులు నవంబరు 28, 29 తేదీల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3వేల 700 బస్తాల 185 టన్నుల బియ్యం తగ్గాయని, దీనిపై ఏం చర్యలు తీసుకోవాలో తెలియజేయాలంటూ పౌరసరఫరాల సంస్థ ఎండీకి అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం టన్ను బియ్యం 48 వేల 500 చొప్పున గల్లంతైన బియ్యం విలువ 89.72 లక్షలు. దీనికి రెట్టింపు జరిమానా వసూలు చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎండీ ఆదేశాలు జారీ చేశారు.