ఆంధ్రప్రదేశ్ కు పెను గండం ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.ఇది 2 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతుంది. వాయు గుండం ప్రభావంతో దక్షిణకోస్తా,రాయలసీమలో కుండపోతగా వర్షాలు కురవనున్నాయి. 15 జిల్లాలకు రెండు రోజుల పాటు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.భారత వాతావరణ శాఖ. కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు ..పలుచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
వాయుగుండం ప్రభావంలో మంగళవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశంఉందని ఐఎండీ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాయుగుండం తీరం వైపు వచ్చే కొలది తీవ్రత పెరగనుంది. తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రెడ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించింది. భారీ వర్ష సూచనతో తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.