తెలంగాణ

ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా?

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించే యోచనలో ఉన్నారంటున్నారు. అనర్హత పిటిషన్ పై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండక ముందే రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ఆలోచనగా ఉందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలవగా.. అందులో ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్లందరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాయిస్ మార్చారు. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెబుతున్నారు. కాంగ్రెస్ లో చేరిన అరికపూడి గాంధీని ఏకంగా పీఏసీ చైర్మెన్ గా నియమించింది ప్రభుత్వం. పీఏసీ చైర్మెన్ పదవిని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు ఇస్తారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ సర్కార్.. గాంధీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చూపిస్తూ ఆయనకు పీఏసీ చైర్మెన్ పదవి కట్టబెట్టింది. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని అరికపూడి గాంధీ చెబుతున్నారు.మిగితా ఎమ్మెల్యేలు కూడా సాంకేతికంగా అనర్హత వేటు తప్పించుకోవడానికి తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. అయితే దానం నాగేందర్ విషయంలో మాత్రం సీన్ మరోలా ఉంది. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం పోటీ చేశారు. దీంతో టెక్నికల్ గా దానం నాగేందర్ దొరికినట్లే. స్పీకర్ ఆయనపై ఖచ్చితంగా వేటు వేయాల్సిన పరిస్థితి.

అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకునేముందే దానం నాగేందర్ తో రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే దానం మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి భయపడుతున్నారని తెలుస్తోంది. 2004లో ఇలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన దానం.. తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరి అసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు దానం నాగేందర్. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం.. తన అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో దానం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండలేకపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలో అసిఫ్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేసినా.. ఎంఐఎం అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2004 సీన్ తో ఈసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు దానం నాగేందర్ సుముఖత చూపడం లేదని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని దానంకు చెప్పినట్లు టాక్.

 

Back to top button