తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ధరణి స్థానంలో తెచ్చిన భూమాత పోర్టల్ కోసమూ ఆమోదం తెలపనున్నారని సమాచారం. మరోవైపు చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని పవర్స్ కల్పించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్’కి సవరణలు చేపడతారని తెలుస్తోంది. ఇదే సమయంలో గతంలో ఉన్న వీఆర్ఏ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ రెవెన్యూ అధికారి ఉద్యోగాలను వీఆర్వో, వీఆర్‌ఏలతోనే సగం పోస్టులు భర్తీ చేయాలని సర్కారు యోచిస్తోంది. మిగతా సగం ఉద్యోగాలు కొత్తవారితో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో నింపాలన్నది గవర్నమెంట్ ప్లాన్ గా తెలుస్తోంది. తాజాగా ఈ కొత్త పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలపై కేబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇక శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హైడ్రా, కొత్త రెవెన్యూ బిల్లులపై ఇటు అసెంబ్లీ, అటు కౌన్సిల్ ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రెండు డ్రాఫ్ట్ బిల్లులపైనా కేబినెట్ లో చర్చలు చేయనున్నట్లు తెలిసింది. ఇక నవంబర్ నెలలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల తేదీలపై ఈ భేటీలోనే చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంలో పెండింగులో ఉన్న ఉద్యోగుల సమస్యలపైనా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగులో ఉన్నాయి.ఇందులో రెండు డీఏలు దీపావళి ముందే ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. జీవో 317పై కమిటి ఇచ్చిన నివేదికపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.