క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అపరేషన్‌ను ఆకర్ష్‌ను నిలువరించేందుకు గులాబీ పార్టీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇండోనేషియా రాజధాని బాలిలో బీఆర్‌ఎస్ నేతల సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. మాజీమంత్రి హరీశ్ రావు ఈ భేటీలో కీలకంగా ఉన్నారంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగియడంతో గులాబీ లీడర్లే టార్గెట్ ఆపరేషన్ మళ్లీ ప్రారంభించింది కాంగ్రెస్. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు.. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ప్రచారం జరిగినా అది జరగలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం ఇప్పట్లో లేనట్టే అని అందరూ భావించారు.. కానీ కాంగ్రెస్ మాత్రం స్పీడ్ పెంచింది. దీంతో గులాబీ బాస్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కుమారుడి వివాహానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది బాలి వెళ్లారు. అయితే వేడుకలో మాజీమంత్రి హరీశ్ రావు జాయిన్ అయ్యారు. బీఆర్‌ఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం..
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను ఖతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తొలినుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనంతా త్వరగా బీఆర్‌ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కావాలంటే ఇంకా 16 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది.. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించాలని రేవంత్ అలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. వీరంతా ఈనెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని టాక్.. అయితే ఈ సమాచారం తెలియడంతోనే బీఆర్‌ఎస్ ఆపరేషన్ బాలి షురూ చేసినట్టు తెలంగాణ భవన్ వర్గాలు అంటున్నాయి. అందుకే ఈ వ్యవహారాన్ని ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇకపై ఒక్క ఎమ్మెల్యే కూడా కారు దిగకుండా పకడ్బందీగా స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రలోభాలకు ఎవరూ తలొగ్గొద్దని… భవిష్యత్ మళ్లీ బీఆర్‌ఎస్‌దేనని ఎమ్మెల్యేలకు హరీశ్ రావు భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బాలి వెళ్లారన్న సమచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ.. వారంతా తిరిగి ఎప్పుడు వస్తారో అని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్లు రాష్ట్రానికి రాగానే వారిని పార్టీలోకి లాగేందుకు ఇప్పటికే ఓ మాస్టర్ ప్లాన్ సిద్దం చేసినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.