తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేసింది. భూమిలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి 12 వేల రూపాయలు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఈ మొత్తాన్ని రెండు ఇన్‌స్టాల్స్‌మెంట్స్‌లో అందిస్తామని ఖమ్మంలో ప్రకటించారు.భూమిలేని నిరుపేద కుటుంబాలకు తొలి ఇన్‌స్టాల్‌మెంట్ 6 వేలను కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం డిసెంబర్ 28 రోజున జమ చేస్తామని భట్టి తెలిపారు.
రైతుల ఖాతాల్లో సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని తెలిపారు. కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ నుంచే అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.సన్న వడ్లకు క్వింటాకు ఇస్తున్న రూ.500 బోనస్ ద్వారా ప్రతి ఏకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అదనంగా రైతులు లబ్ధి పొందుతున్నారని భట్టి వివరించారు. ప్రజా ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడాది పాలనలో వ్యవసాయానికి, రైతుల కోసం నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.