తెలంగాణ
Trending

ఆ మంత్రి చెప్పడం వల్లే ఎమ్మెల్యే వీరేశాన్ని అవమానించారా?

నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో చెలరేగిన వర్గపోరు మరింత ముదురుతోంది. కేసుల వరకు వెళుతోంది. మంత్రుల రివ్యూ సమావేశానికి వెళ్లిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేనని చెప్పినా పోలీసు అధికారులు వినలేదు. తనకు జరిగిన అవమనాన్ని జీర్ణించుకోలేక అక్కడి నుంచి వచ్చేశారు ఎమ్మెల్యే వేముల వీరేశం. జిల్లాకు చెందిన సహచర ఎమ్మెల్యేలు వారిస్తున్నా .. పోలీసులను తిడుతూ వెనక్కి వచ్చేశారు వేముల వీరేశం. జిల్లా సమస్యలపై పెట్టిన సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేను.. అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేను పోలీసులు ఆపేయడం.. ఎంత చెప్పినా లోపలికి పంపకపోవడం రాష్ట్రంలోనే సంచలనమైంది.

ఎమ్మెల్యే వీరేశాన్ని పోలీసులు ఎందుకు ఆపేశారు.. ఎమ్మెల్యే అని చెప్పినా ఎందుకు వినలేదు.. ఆయనను గుర్తుపట్టకుండా అపేస్తే.. ఎమ్మెల్యే అని చెప్పాక అయినా లోపలికి పంపించాలి కదా.. మరీ అలా ఎందుకు చేయలేదు.. ఇదే ఇప్పుడు మిస్టరీగా మారింది. తనను కావాలనే అవమానించారని చెబుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. దళిత ఎమ్మెల్యేను కాబట్టే తనను అవమానించారని ఆరోపిస్తున్న వేముల.. తనకు జరిగిన అవమానంపై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి తనను అడ్డుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రివిలేజ్ మోషన్ పిటిషన్ ఇచ్చారు.

స్పీకర్ ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్న ఎమ్మల్యే వీరేశం తనకు జరిగిన అవమానంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తనను కావాలనే అవమానించారని.. కావాలనే కొందరు నేతలు ఇలా చేయించారని ఆరోపించారు. ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీరేశం.. తనను అవమానించిన నేతను రోడ్డుకీడుస్తానని చెప్పారు. జిల్లాకు చెందిన కీలక నేతే ఇలా చేయించారనే అర్థం వచ్చేలా మాట్లాడారు వీరేశం. సదరు నేత బండారం బయటపెట్టి తీరుతానన్నారు. తిండి లేకపోయినా ఊరుకుంటాం కాని ఆత్మగౌరవం చంపుకుని ఉండలేమన్నారు. అవమానం అస్సలు భరించలేమన్నారు. తనను అవమానించిన పోలీసు అధికారులతో పాటు బడా నేత భరతం పడతానని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే వీరేశం.

మరోవైపు వేముల వీరేశానికి జరిగిన అవమానం వెనుక జిల్లాకు చెందిన మంత్రి హస్తం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వేముల అనుచరులు కూడా ఇదే చెబుతున్నారు. వేముల వీరేశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సదరు నేతతో సై అంటే సై అన్నట్లుగా పోరాడారు. అప్పటివరకు జిల్లాలో కింగ్ లా మెలిగిన సదరు నేత.. వేముల ధాటికి తట్టుకోలేక నియోజకవర్గానికి రాలేని పరిస్ఖితి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా పాత వైరం అలానే ఉందంటున్నారు. ఎన్నికల సమయంలో కలిసి పనిచేసినా.. అంత పైపైనేననే టాక్ వస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్జాకా వేములను ఆ నేత టార్గెట్ చేయడం మొదలు పెట్టారని అంటున్నారు. ఆ నేత చెప్పడం వల్లే పోలీసులు వీరేశాన్ని అవమానించారనే చర్చ నకిరేకల్ నియోజకవర్గంలో సాగుతోంది. సదరు నేత విషయంలో వేముల ఏం చేయబోతున్నారు.. ఈ వివాదం ఎక్కడికి వరకు వెళుతోంది.. నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో ఏం జరగబోతుంది అన్నది ఆసక్తిగా మారింది.

Back to top button