జాతీయం

అలిగిన షిండే.. మహారాష్ట్ర సీఎం పదవిపై వీడని సస్పెన్స్

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మహాయుతి కూటమికి బంపర్ మెజార్టీ వచ్చినా సీఎం పదవిపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. ఢిల్లీలో చర్చల మీద చర్చలు జరిగినా ప్రభుత్వ ఏర్పాటుపై కదలిక రావడం లేదు. ఫలితాలు వచ్చిన వారం రోజులు అవుతున్ా సీఎం ఎంపిక కొలిక్కి రాకపోవడంతో మూడు పార్టీల కేడర్ లోనూ కలవరం కనిపిస్తోంది. ఢిల్లీలో శుక్రవారం జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం అనుకోకుండా రద్దవ్వటంతో తెరవెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అడుగులు కూటమిలో కలకలం రేపుతున్నాయి. సతారా జిల్లాలోని తన సొంత గ్రామానికి ఆయన చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది.

బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతోపాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. మంత్రివర్గం కూర్పు, మంత్రి పదవుల పంపకంపై వారు చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఫడ్నవీస్, షిండే, అజిత్‌ పవార్‌ ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం ఉదయం ముంబైకి చేరుకున్నారు. శుక్రవారం ముగ్గురు నేతల మధ్య కీలక సమావేశం జరగాల్సి ఉంది. నూతన ముఖ్యమంత్రి ఎంపికతోపాటు మంత్రి పదవుల పంపకాన్ని ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఏక్‌నాథ్‌ షిండే ఆకస్మికంగా తన సొంత గ్రామానికి వెళ్లిపోవడంతో చర్చలు ఆగిపోయాయి.

తాజా పరిణామాల పట్ల షిండే అసంతృప్తితో ఉన్నారని, అందుకే అలకబూని మిత్రపక్షాలతో చర్చలు కొనసాగించడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మహాయుతి సమావేశం ఆదివారం జరుగనున్నట్లు షిండే వర్గాలు తెలిపాయి. కొత్త ముఖ్యమంత్రి వచ్చేవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వివరించాయి. తమ పార్టీ నేత ఏక్‌నాథ్‌ షిండేలో ఎలాంటి అసంతృప్తి లేదని, ఆయన శనివారం ముంబైకి తిరిగి వస్తారని శివసేన నాయకుడు ఉదయ్‌ సామంత్‌ చెప్పారు. ఢిల్లీలో షిండే తమ పార్టీ డిమాండ్లను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై అమిత్‌ షా అతిత్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తారని వెల్లడించారు.

బీజేపీ 132, షిండే శివసేనకు 57, అజిత్‌ ఎన్సీపీకి 41 సీట్లు గెలుచుకున్నాయి. సీఎం కుర్చీ కోసం మూడు పార్టీల ముఖ్యనేతలు పోటీపడినా.. మిత్రపక్షాలకు సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించడం లేదు. దాంతో కనీసం మంత్రి పదవుల్లోనైనా ఎక్కువ వాటా సొంతం చేసుకోవాలని షిండే, అజిత్‌ పవార్ లు ఆరాటపడుతున్నారు. మిత్రపక్షాలకు 20 మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో తమకే ఎక్కువ పదవులు కావాలని అజిత్‌ పట్టుబడుతున్నారు. మరోసారి సీఎం పదవి తనకే ఇవ్వాలని ఏక్‌నాథ్‌ షిండే తొలుత డిమాండ్‌ చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం బుజ్జగించడంతో మెత్తబడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి అంగీకరించినట్లు తెలిసింది. కానీ కీలకమైన హోంశాఖను తనకే అప్పగించాలని షరతు పెట్టారు.

మరోవైపు ఉప ముఖ్యమంత్రి పోస్టుపై షిండే శివసేనలో రెండు రకాల వాదనలు వినిపిస్తాయి.ఈ పదవి తీసుకోవాలని ఒక వర్గం చెబుతుండగా,అవసరం లేదని మరో వర్గం వ్యతిరేకిస్తోంది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావడం ఏమిటని షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్‌ సిర్సాత్‌ ప్రశ్నించారు.పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి చిన్న పదవిలో ఇమడలేరని చెప్పారు.ఉప ముఖ్యమంత్రి పదవిలో షిండే కూర్చొనే అవకాశం లేదని అన్నారు. కూటమి ధర్మాన్ని తన తండ్రి గౌరవిస్తారని, వ్యక్తిగత ఆకాంక్షలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోరని ఏక్‌నాథ్‌ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్‌ షిండే స్పష్టంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button