కుండపోత వానలతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోయింది. ఉత్తర కోస్తా వణికిపోయింది. విజయవాడ వరదతో విలవిలలాడింది. గుంటూరు గుండె చెరువైంది. రాజధాని అమరావతి అస్తవ్యస్థమైంది. భారీ వర్షాలతో గోదావరి జిల్లాలు జలమలమయ్యాయి. వందలాది గ్రామాలను వరద ముంచెత్తింది. ఆకస్మాత్తుగా వచ్చిన వరదలతో జనాలు భిక్కుబిక్కుమంటూ రాత్రి కాలం గడిపారు.
అర్థరాత్రి వేళ ముంచెత్తింది రామిలేరు వరద. ముంచుకొస్తున్న వరద నుంచి ప్రజలను కాపాడటానికి అర్థరాత్రి 2గంటలకు స్వయంగా రంగంలోకి దిగారు పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ముంపు గ్రామాలకు వెళ్లారు. ప్రజలను ఇండ్ల నుంచి బయటికి తీసుకొచ్చారు.
“అమ్మా వరద వచ్చేస్తుంది, నిద్ర లేవండి – నేను పడవలు తెప్పిస్టాను – ఈలోపు డాబాల పైకి వెళ్ళండి” అంటూ రామిలేరువాగు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను స్వయంగా అప్రమత్తం చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తాళ్ళమూడి సహా పలు గ్రామాల్లోని జనావాస ప్రాంతాల్లోకి వరద నీరు ముంచెత్తుతుండటంతో నిద్ర మత్తులో ఉన్న ప్రజలను వరద గురించి హెచ్చరిస్తూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా అప్రమత్తం చేసారు. ఇతర గ్రామస్తులు సైతం ప్రజలను అప్రమత్తం చేసేలా సూచించారు.
ఎమ్మెల్యే చింతమనేని హెచ్చరికలతో అప్రమత్తం అయినా ప్రజలు తమ ఇంటి డాబా లపైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వీ తో ఫోన్లో మాట్లాడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ “రామిలేరు వాగు వరద తీవ్రతను వివరించారు. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా తక్షణమే అన్ని రకాల చర్యలు చేపట్టాలని, దిగువన ఉన్న లాకులు తెరవటం వంటి సత్వర చర్యల ద్వారా వరద ప్రవాహ తీవ్రతను జనావాసాల వైపు తగ్గించేలా చర్యలు చేపట్టాలని, పడవల ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా కలక్టర్ ఆదేశాలతో పలు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.