తెలంగాణ

రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్ కు షాకిస్తూ స్పీకర్ నిర్ణయమే పైనల్ అని స్పష్టం చేసింది. అనర్హత వేటుపై స్పీకర్ కు గడువు విధించలేమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరటనిచ్చేలా హైకోర్టు తీర్పు రావడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. మళ్లీ ఫిరాయింపులు మొదలు కానున్నాయని తెలుస్తోంది. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని చెప్పారు. కేటీఆర్ తో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని బాంబ్ పేల్చారు. పీసీసీ చీఫ్ ప్రకటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు జంపింగ్ కు సిద్ధంగా ఉన్నారనే టాక్ వస్తోంది.

నాలుగు వారాల్లో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవచ్చన్న తెలిపింది హైకోర్టు. అసెంబ్లీ ఐదేళ్లగడువును దృష్టిలో పెట్టుకోవాలని సూచించిన కోర్ట్‌..నిర్ణీత సమయంలో స్పీకర్‌ చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ , కడియం శ్రీహరి , తెల్లం వెంకటరావు పై అనర్హత విధించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది. అనర్హత విషయంలో నెలరోజుల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది.

ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే న్యాయస్థానం సూచించిందన్నారు. అన్ని విషయాలు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లి దెబ్బతిన్నారని విమర్శించారు. పదేళ్లపాటు రాజ్యాంగాన్ని  అపహాస్యం చేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. పార్టీలకు పార్టీలను విలీనం చేసుకుని రాజ్యాంగాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని, ఐదారుగురు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండరని జోస్యం చెప్పారు.

Back to top button