ఆంధ్ర ప్రదేశ్

టీచర్లకు షాక్.. స్కూల్ సమయం గంట పెంపు

ఉపాధ్యాయ్యులకు షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల సమయాల్లో మార్పులు చేశారు. సమయాన్ని ఓ గంట పెంచారు. అకడమిక్‌ కేలండర్‌లో ఆప్షనల్‌గా ఉన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్ని తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల పనివేళలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉండగా.. దీన్ని 5 గంటల వరకు పెంచింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ప్రతి మండలానికి రెండు స్కూళ్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలిచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్‌ల సమయం 5 నిమిషాల చొప్పున.. భోజన విరామం 15 నిమిషాలు పెంచింది. ఉదయం మొదటి పీరియడ్‌ 5 నిమిషాలు పెంచి 50 నిమిషాలు చేశారు. ఆ తర్వాత 3 పీరియడ్లు ప్రస్తుతం 40 నిమిషాల చొప్పున ఉండగా వాటిని 45 నిమిషాలకు పెంచారు. మధ్యాహ్నం మొదటి పీరియడ్‌ను మార్చకుండా.. ఆ తర్వాత 3 పీరియడ్లు 45 నిమిషాలకు పెంచారు. ఈ మార్పులతో రోజులో స్కూల్ సమయం గంట పెరుగనుంది.

నవంబర్‌ 25 నుంచి 30 వరకు ఎంపిక చేసిన స్కూళ్లలో ఈ విధానంలో పాఠశాలలు నడుపుతారు. కేవలం సబ్జెక్టులు బోధించడానికి మాత్రమే గంట సమయం పొడిగించామని.. మిగతా వెయిటేజీలో మార్పులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఈ విధానం తర్వాత ఈ నెల 30న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌కి అభిప్రాయాలు తెలపాలని ఆదేశించారు. దాని ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో అమలు చేయనున్నారు.

స్కూళ్ల కొత్త పనివేళలపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.. ప్రస్తుత పనివేళలనే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళల మార్పు నిర్ణయంపై పునరాలోచించాలని ఏపీటీఎఫ్‌ నేతలు కోరారు. 5 కి.మీ. పరిధి నుంచి విద్యార్థులు వస్తున్నందున సాయంత్రం ఐదింటి వరకు బడిలో ఉంటే ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని వారు చెబుతున్నారు.

Back to top button