Uncategorized

ఎమ్మెల్సీ కవితకు బెయిల్!జైలు ముందు 26 మంది ఎమ్మెల్యేల స్వాగతం

కేసీఆర్ కుటుంబంలో చాలా రోజులకు పండుగ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబంలో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై గత ఐదు నెలలుగా తీహారు జైలులో ఉన్న కవితకు ఇవాళ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కవితకు బెయిల్ పక్కా అనే సమాచారంతో బీఆర్ఎస్ నేతలంతా ఢిల్లీకి వెళ్లారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్నారు. కవితకు బెయిల్ వస్తే ఆమెను రిసీవ్ చేసుకోవడానికే వీళ్లంతా ఢిల్లీకి వెళ్లారని చెబుతున్నారు.

క‌విత బెయిల్ పిటిష‌న్ పై సుప్రీంకోర్టులో వాద‌న‌లు జ‌ర‌గ‌నున్నాయి.జ‌స్టిస్ గ‌వాయి,జ‌స్టిస్ విశ్వానాథ‌న్ బెంచ్ ముందు వాద‌న‌లు జరగనున్నాయి. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ రావ‌టంతో క‌విత బెయిల్ పై ఆశ‌గా ఉన్నారు గులాబీ నేతలు. క‌విత త‌ర‌ఫున సుప్రీంకోర్టు సీనియ‌ర్ లాయ‌ర్, మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ్గ‌తీ వాదిస్తున్నారు. గ‌త రెండు విచార‌ణ‌ల సంద‌ర్భంగా కోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వ‌న‌ప్ప‌టికీ… రెగ్యూల‌ర్ బెయిల్ పై వాద‌న‌లు వింటామ‌ని చెప్పింది. గ‌త విచార‌ణ సంద‌ర్భంగా ఈడీ కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌కపోవ‌టంతో కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

సిసోడియా బెయిల్ సందర్భంగా కేసు విచారణపైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్య‌క్తిని ఎన్ని రోజులు జైల్లో పెడ‌తారు? ఇది ప్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగం క‌లిగించ‌ట‌మేనని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ పాయింట్ తోనే రోహ్గ‌తీ వాద‌నలు వినిపిస్తున్నారు. మ‌హిళ‌, అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నారని.. మార్చి నుండి జైల్లోనే ఉన్న విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని కవిత త‌ర‌ఫు లాయ‌ర్లు కోరుతున్నారు. ఇటీవల వరుసగా కవిత అనారోగ్యానికి గురవుతున్నారు. జైలు డాక్టర్ల సూచనతో ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్య కారణాలతోనూ కవితకు బెయిల్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అందుకే బీఆర్ఎస్ నేతలంతా ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది.

Back to top button