
ప్రస్తుతం యువతలో సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందని ప్రముఖ నిర్మాత మైత్రీ రవి అన్నారు. సోషల్ మీడియా మోజులో పడి కొందరు యువత చెడు అలవాట్లకు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువతకు మంచి విలువలు, ధైర్యం, నిజాయితీ, భక్తి వంటి సానుకూల అంశాలను పరిచయం చేసే సినిమాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో ‘హనుమాన్ అంశ్’ వంటి చిత్రాలు యువతపై మంచి ప్రభావం చూపగలవని మైత్రీ రవి తెలిపారు. సినిమా వినోదంతో పాటు సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని కూడా అందించగలిగితే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. హనుమంతుడి స్ఫూర్తితో ధైర్యం, నిజాయితీ, భక్తి వంటి విలువలను యువతకు చేరువ చేయడం ఈ సినిమా ప్రత్యేకతగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుందని ఆయన తెలిపారు. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.400 కోట్ల వసూళ్లు సాధించిందని వెల్లడించారు. కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమా కూడా భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఈ చిత్రం మరోసారి నిరూపించిందని అన్నారు.
కాగా, ‘హనుమాన్ అంశ్’ చిత్రాన్ని అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. యువతను ఆకట్టుకోవడంతో పాటు వారికి మంచి సందేశాన్ని అందించే చిత్రంగా ఇది నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
also read: డ్రిల్లింగ్ మెషీన్‌తో పని చేస్తుండగా ఘోర ప్రమాదం.. 10 గంటల శస్త్రచికిత్సతో యువకుడి చేతికి పునర్జీవం