Telangana Doctor Dies By Suicide: సిద్ధిపేట జూనియర్ డాక్టర్ బి. లావణ్య ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఆమె ఆత్మహత్యకు లవ్ ఫెయిల్యూరే కారణం అని చెప్పారు. సిద్దిపేట మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేసి, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్ షిప్ చేస్తున్నది జూనియర్ డాక్టర్ బి.లావణ్య. అదే ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ చదువుతున్న వైద్యుడు ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి మాటెత్తేసరికి దళితురాలంటూ దూరం పెట్టడంతోనే ఆమె మనస్త్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తేల్చారు.
కీలక విషయాలు వెల్లడించిన ఏసీపీ రవీందర్ రెడ్డి
సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు. గద్వాల జిల్లా మానోపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన పేద దళిత కుటుంబానికి చెందిన బి. లావణ్య (23) సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. ఆమె, 2020లో నీట్ మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ లో చేరారు. ఆమె తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తున్నారు.
కులం పేరుతో పెళ్లికి నిరాకరణ
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జనరల్ మెడిసిన్ చదువుతున్న సికింద్రాబాద్ అల్వాల్‌కు చెందిన ప్రణయ్ తేజ్ బీసీ కంసాలితో గత జూలై నెలలో లావణ్యకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటానని నమ్మించి, సన్నిహితంగా మెలిగిన ప్రణయ్ తేజ్, అనంతరం కులాన్ని అడ్డుగా చూపించి వివాహానికి నిరాకరించాడు. లావణ్య తీవ్ర మనస్తాపానికి గురై జనవరి 3న మెడికల్ కళాశాల హస్టల్ రూమ్‌లో గడ్డిమందును ఇంజెక్ట్ చేసుకుంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను గమనించిన స్నేహితులు చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుండి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ లావణ్య 4న మృతి చెందింది.
మృతురాలి అక్క శిరీష ఫిర్యాదు మేరకు ప్రణయ్ తేజ్‌పై సిద్దిపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 108, 69 కింద కేసు నమోదు చేశారు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.





