
సంక్రాంతి పండుగ అంటే సాధారణంగా మూడు రోజుల వేడుకగానే అందరికీ తెలుసు. భోగి, సంక్రాంతి, కనుమతో ముగిసే ఈ పండుగ దేశవ్యాప్తంగా ఒకే తరహాలో జరుపుకుంటారు. కానీ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని ఇటకర్లపల్లి గ్రామంలో మాత్రం సంక్రాంతి తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. ఈ గ్రామంలో పాటిస్తున్న ప్రత్యేక సంప్రదాయాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇటకర్లపల్లిలో భోగి రోజుతోనే పండుగ మొదలవదు. భోగికి ముందే వచ్చే ఆది, సోమ, మంగళవారాల్లోనే గ్రామంలో పండుగ సందడి మొదలవుతుంది. ఈ మూడు రోజులను అక్కడి ప్రజలు భోగి, సంక్రాంతి, కనుమగా భావిస్తూ వేడుకలు నిర్వహిస్తారు. ఇదే ఈ గ్రామానికి ఉన్న మొదటి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
అంతేకాదు, జనవరి 14, 15, 16 తేదీల్లో కూడా వేర్వేరు వర్గాల వారు సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటారు. గొర్లె, దన్నాన, శెగిడి, గడి, రజకులు, నాయీ బ్రాహ్మణులు వంటి వర్గాలు తమ సంప్రదాయాల ప్రకారం ఈ మూడు రోజుల్లో పండుగ చేసుకుంటారు. ప్రతి వర్గం తమ కులవృత్తులకు అనుగుణంగా ప్రత్యేక ఆచారాలు పాటిస్తూ సంక్రాంతిని జరుపుకోవడం అక్కడి విశేషం.
కమ్మరి కుటుంబాల పండుగ నిర్వహణ అయితే మరింత ప్రత్యేకంగా ఉంటుంది. వీరు కనుమ రోజున భోగి పండుగను నిర్వహిస్తారు. ఆ తర్వాత వచ్చే ముక్కనుమ నాడు సంక్రాంతిని జరుపుకుంటారు. అనంతరం వచ్చే రోజున కనుమ పండుగను చేస్తారు. ఇలా ఒకే గ్రామంలో వేర్వేరు రోజుల్లో, వేర్వేరు వర్గాల వారు సంక్రాంతిని జరుపుకోవడంతో మొత్తం తొమ్మిది రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొంటుంది.
తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ఇటకర్లపల్లి గ్రామస్థులు ఇప్పటికీ అచంచలంగా కొనసాగిస్తున్నారు. గ్రామంలో ప్రతి కుటుంబం, ప్రతి వర్గం ఒకదానికొకటి గౌరవం ఇస్తూ తమ తమ రోజుల్లో పండుగ చేసుకోవడం అక్కడి సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తుంది. అందుకే ఇటకర్లపల్లి గ్రామంలో సంక్రాంతి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. ఒక సమూహ సంస్కృతి, జీవన విధానంగా మారింది. 3 రోజుల పండుగగా తెలిసిన సంక్రాంతి.. ఇటకర్లపల్లి గ్రామంలో 9 రోజుల ఉత్సవంగా రూపుదిద్దుకోవడం అక్కడి సంప్రదాయ వైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
ALSO READ: Sankranthi Effect: ఆకాశాన్ని అంటుతున్న చికెన్, మటన్ ధరలు





