
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మాఘమేళాలో ఓ యువ సాధువు భక్తుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే ఆయన చేపట్టిన కఠిన తపస్సు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ఏడేళ్లుగా ఆయన ఒంటికాలిపైనే జీవిస్తూ, ఎప్పుడూ కూర్చోకుండా, పడుకోకుండా తపస్సు కొనసాగించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
బిహార్‌లోని సీతామఢీ ప్రాంతానికి చెందిన ఈ సాధువు పేరు శంకర్‌పురి. ఆయన మాటల్లో చెప్పాలంటే.. గత ఏడేళ్ల కాలంలో ఒక్కసారి కూడా తాను కూర్చోలేదని, పడుకోలేదని వెల్లడించారు. తినడం, నీళ్లు తాగడం వంటి సాధారణ పనులన్నీ కూడా నిల్చునే చేస్తానని తెలిపారు. ఈ విధమైన జీవనశైలి తన తపస్సులో భాగమని ఆయన చెబుతున్నారు.
శంకర్‌పురి చిన్ననాటి నుంచే ఆధ్యాత్మికత వైపు ఆకర్షితుడయ్యాడని సమాచారం. కేవలం ఆరేళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించిన ఆయన.. అప్పటి నుంచి సాధువుగా జీవితం కొనసాగిస్తున్నారు. బాల్యంలోనే ప్రపంచ సుఖాలను త్యజించి, తపస్సు మార్గాన్ని ఎంచుకోవడం భక్తులను మరింత ఆశ్చర్యపరుస్తోంది.
మాఘమేళాలో శంకర్‌పురిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆయన ఒంటికాలిపై నిలబడి గంటల తరబడి ధ్యానం చేయడం చూసి చాలామంది మైమరచిపోతున్నారు. కొందరు భక్తులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా, తపస్సే తనకు శక్తినిస్తోందని శంకర్‌పురి చెబుతున్నారు.
సోషల్ మీడియాలో కూడా ఈ ఒంటికాల సాధువు వీడియోలు, ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆధునిక యుగంలోనూ ఇంత కఠినమైన త్యాగం, నియమాలతో జీవించడం అరుదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ప్రయాగ్‌రాజ్ మాఘమేళాలో సాధువుల వైవిధ్యానికి మరో ఉదాహరణగా శంకర్‌పురి నిలుస్తూ, భక్తి, తపస్సుకు ప్రతీకగా మారుతున్నారు.
ALSO READ: ‘అమెజాన్ పే’లో మరో కొత్త సేవలు





