
ఆంధ్రప్రదేశ్‌లో జాతి కోళ్ల పెంపకాన్ని కొందరు రైతులు, యువకులు పూర్తిస్థాయి కుటీర పరిశ్రమలా అభివృద్ధి చేస్తున్నారు. సంప్రదాయ నాటు కోళ్లతో పోలిస్తే జాతి కోళ్ల పెంపకంలో లాభాలు ఎక్కువగా ఉండటంతో ఈ రంగం వైపు ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా పందెం పుంజులు మాత్రమే కాకుండా జాతి కోళ్ల గుడ్లు, ఒక రోజు వయసు ఉన్న కోడిపిల్లలు, నెలరోజుల పిల్లలను కూడా విక్రయిస్తూ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు.
జాతి కోళ్లకు ఉన్న ప్రత్యేకతలు, ఆకర్షణీయమైన రంగులు, శరీర దృఢత్వం, వేగంగా పెరిగే లక్షణాలే ఈ వ్యాపారానికి ప్రధాన బలం. ఈ నేపథ్యంలో పెంపకదారులు పుంజులు, పెట్టల రంగు, వాటి జాతి నాణ్యతను స్పష్టంగా చూపించేలా ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపులు, ఇతర ఆన్‌లైన్ వేదికల ద్వారా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు.
ఈ వ్యాపారంలో గుడ్లకే భారీ ధర పలుకుతోంది. సాధారణ జాతి కోడి గుడ్లు ఒక్కోటి రూ.500 వరకు విక్రయమవుతున్నాయి. ఇందులో భీమవరం రెచ్చివాటం, పెరూ, పెరూ క్రాస్ వంటి ప్రసిద్ధ జాతుల కోడి గుడ్లకు మరింత డిమాండ్ ఉంది. ఈ జాతులకు చెందిన గుడ్లు ఒక్కొక్కటి రూ.600 వరకు అమ్ముడవుతున్నాయి. మంచి జాతి నుంచి వచ్చే పిల్లలు భవిష్యత్తులో ఎక్కువ ధరకు విక్రయించవచ్చన్న అంచనాతో పెంపకదారులు ఈ ఖరీదైన గుడ్లను కొనుగోలు చేస్తున్నారు.
ఫోన్ ద్వారా ఆర్డర్ ఇస్తే గుడ్లు పాడవకుండా ప్రత్యేక ప్యాకింగ్‌తో ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. రవాణా సమయంలో గుడ్లకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విక్రేతలు చెబుతున్నారు. భీమవరం, భీమడోలు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం వంటి ప్రాంతాల నుంచి ఈ వ్యాపారం ప్రధానంగా కొనసాగుతోంది.
ఈ గుడ్లను కొనుగోలు చేసిన పెంపకదారులు వాటిని ఇంక్యుబేటర్లలో లేదా పెట్టల సహాయంతో పొదిగించి కోడిపిల్లలను తయారు చేసుకుంటున్నారు. మంచి జాతి పిల్లలు లభిస్తే మార్కెట్‌లో వాటికి అధిక ధర రావడంతో పెట్టుబడి త్వరగా తిరిగివస్తుందని వ్యాపారులు భావిస్తున్నారు. దీంతో ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు పెరుగుతున్నాయి.
జాతి కోళ్ల పెంపకం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి కొత్త అవకాశంగా మారుతోంది. తక్కువ స్థలంలో, పరిమిత పెట్టుబడితో ప్రారంభించవచ్చని, లాభాలు ఎక్కువగా ఉండటంతో ఈ రంగం భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, జాతి పేరుతో మోసాలు జరిగే అవకాశమూ ఉండటంతో కొనుగోలుదారులు నాణ్యతపై, విశ్వసనీయతపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
ALSO READ: ఆకాశం నుంచి చేపల వర్షం.. ఎక్కడో తెలుసా?





