
హరియాణా రాష్ట్రంలోని ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన కవిత అనే 32 ఏళ్ల మహిళకు జీవితంలో ఊహించని, నమ్మశక్యం కాని అనుభవం ఎదురైంది. చిన్నప్పట్లో జరిగిన ఓ స్వల్ప గాయం.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమెకు షాకింగ్ ఘటనను బయటపెట్టింది. 12 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో ఆమె తొడ భాగంలో పదునైన వస్తువు తగిలినట్లుగా గాయం అయ్యింది. ఆ గాయం సాధారణమేనని భావించిన కుటుంబసభ్యులు చికిత్స చేయించగా, కొద్ది రోజుల్లోనే అది పూర్తిగా మానిపోయింది. అప్పట్లో అది పెద్దగా ప్రాధాన్యం పొందలేదు.
అయితే, ఇటీవల కవితకు ఆ ప్రాంతంలో తీవ్ర నొప్పితో కూడిన కురుపు ఏర్పడింది. రోజురోజుకు అది పెద్దదవుతూ, చివరకు పగిలిపోయింది. అక్కడి నుంచి ఏదో అసాధారణమైన వస్తువు బయటకు రావడంతో ఆమెతో పాటు కుటుంబసభ్యులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అది ఒక బుల్లెట్ కావడం చూసి అందరూ షాక్‌కు లోనయ్యారు. శరీరంలో 20 సంవత్సరాలకు పైగా ఒక బుల్లెట్ ఉండడం, ఎలాంటి తీవ్రమైన లక్షణాలు లేకుండా ఉండటం వైద్యులను కూడా విస్మయానికి గురిచేసింది.
వైద్యులు పరిశీలించిన తర్వాత, ఆ బుల్లెట్ చాలా పాతదని, ఆమె చిన్నప్పుడే శరీరంలోకి ప్రవేశించి ఉండవచ్చని నిర్ధారించారు. అప్పట్లో తగిలిన గాయాన్ని పదునైన వస్తువు గాయం అని భావించినప్పటికీ, నిజానికి అది బుల్లెట్ గాయమే అయ్యుండవచ్చని తెలిపారు. శరీరంలో లోతుగా ఉండటంతో పాటు ఎటువంటి కీలక అవయవాలను తాకకపోవడం వల్ల, అది ఇన్నేళ్లపాటు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండిపోయిందని వైద్యులు అభిప్రాయపడ్డారు.
కవిత నివసించిన కోటా ఖండేవాలా గ్రామం సమీపంలో ఒక సైనిక శిక్షణ శిబిరం ఉండేది. గతంలో అక్కడ తరచూ శిక్షణ కార్యక్రమాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ తప్పుదారి పట్టి కవితను తాకి ఉండవచ్చని భావిస్తున్నారు. చిన్నపిల్ల కావడంతో, అప్పట్లో జరిగిన సంఘటన తీవ్రత ఆమెకు గానీ, కుటుంబానికి గానీ అర్థం కాలేదని తెలుస్తోంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో ఇది విస్తృతంగా చర్చకు దారి తీసింది. కొందరు నెటిజన్లు ఇది నిజంగా సినిమాలను మించిన కథ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ: ఈ ఒక్క అలవాటు ఉంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే! (VIDEO)





