ప్రియుడికి వీడియో కాల్ చేసి.. మహిళా న్యాయవాది ఆత్మహత్య

అన్నాడీఎంకే కళ్లకురిచ్చి ఉత్తర యూనియన్ కార్యదర్శి రాజశేఖర్ కుమార్తె అనీషా(25) మృతి ఘటన చెన్నైలో తీవ్ర కలకలం రేపింది.

అన్నాడీఎంకే కళ్లకురిచ్చి ఉత్తర యూనియన్ కార్యదర్శి రాజశేఖర్ కుమార్తె అనీషా(25) మృతి ఘటన చెన్నైలో తీవ్ర కలకలం రేపింది. విద్య, ఉద్యోగ జీవితం అన్నీ చక్కగా సాగుతున్న తరుణంలో ఆమె తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులను, రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఓఎంఆర్ రోడ్డులోని యాగాటూర్ ప్రాంతంలో ఉన్న బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో గత ఐదేళ్లుగా అనీషా నివాసం ఉంటోంది. చదువుపై పూర్తి దృష్టి పెట్టిన ఆమె ఇటీవలే కేళంబాక్కంలోని ఓ ప్రైవేట్ న్యాయ కళాశాలలో కోర్సు పూర్తి చేసింది.

న్యాయ విద్య పూర్తిచేసిన అనంతరం బార్ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేసుకునేందుకు అనీషా దరఖాస్తు చేసింది. న్యాయ రంగంలో స్థిరపడాలనే ఆశయంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ లీగల్ అడ్వైజరీ సంస్థలో ఉద్యోగంలో చేరింది. వృత్తి పరంగా మంచి భవిష్యత్తు కనిపిస్తున్న ఈ దశలో ఆమె జీవితం ప్రశాంతంగా సాగుతుందని కుటుంబసభ్యులు భావించారు.

ఈ నేపథ్యంలో చెన్నై అడయార్ ప్రాంతంలోని ఓ జిమ్‌కు అనీషా నిత్యం వెళ్తూ ఉండేది. అక్కడే నిత్యానందం అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆపై ప్రేమగా మారినట్లు సమాచారం. ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటూ ఉండేవారని, ఒకరిపై ఒకరికి భావోద్వేగ అనుబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఆదివారం అర్ధరాత్రి అనీషా తన ప్రియుడు నిత్యానందానికి వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆ మాటలు విన్న నిత్యానందం తీవ్ర ఆందోళనకు గురయ్యాడని, వెంటనే ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని కాపలాదారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది.

వెంటనే అపార్ట్‌మెంట్ భద్రతా సిబ్బంది స్పందించి భవనంలోని అన్ని అంతస్తులు, గదుల్లో తనిఖీలు చేపట్టారు. అయితే అనీషా గది లోపల నుంచి తాళం వేసి ఉండటంతో తలుపు తెరవలేకపోయారు. చివరకు సోమవారం సాయంత్రం ఆమె గది తలుపును పగలగొట్టి లోపలికి వెళ్లగా, ఫ్యాన్‌కు ఉరివేసుకుని అనీషా మృతి చెందిన దృశ్యం కనిపించింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై స్పష్టత కోసం ఆమె ఫోన్ కాల్ డేటా, సందేశాలు, వ్యక్తిగత జీవిత వివరాలను పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనలో కీలకంగా ఉన్న నిత్యానందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో ఏవైనా విభేదాలు ఉన్నాయా, మానసిక ఒత్తిడి కారణమైందా, లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే అంశాలపై దృష్టి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ విషాద ఘటన అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. రాజశేఖర్ కుటుంబానికి పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలియజేశారు.

ALSO READ: బ్యాంకుల సమ్మె: వరుసగా 3 రోజులు బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button