అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన ఒక ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. గర్భస్రావానికి సంబంధించిన చట్టాలు, మహిళల హక్కులపై మరోసారి వివాదం రేగేలా ఈ సంఘటన మారింది. అక్కడికి చెందిన ఒక మహిళ గర్భస్రావం కోసం మందులు వినియోగించి, నెలలు నిండకుండానే శిశువుకు జన్మనిచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ శిశువు పుట్టిన కొన్ని గంటలకే మరణించడంతో, ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఈ పరిణామంపై పోలీసులు స్పందించి, ఆ మహిళపై హత్య ఆరోపణలతో కేసు నమోదు చేశారు.
నివేదికల ప్రకారం.. ఆ మహిళ సుమారు 22 నుండి 24 వారాల గర్భిణిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో బిడ్డకు జన్మనివ్వాలనే ఆసక్తి లేకపోవడంతో, ఆమె గర్భస్రావం కోసం మిసోప్రోస్టోల్ మాత్రలను వినియోగించినట్లు సమాచారం. ఈ మందుల ప్రభావంతో ఆమెకు ముందుగానే ప్రసవం జరిగి, శిశువు పుట్టింది. అయితే పుట్టిన కొద్ది గంటలకే ఆ శిశువు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
జార్జియా రాష్ట్రంలో గర్భస్రావంపై కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా పిండంలో గుండె కొట్టుకోవడం ప్రారంభమైన తర్వాత గర్భస్రావం చేయడం నిషేధించబడింది. ఈ చట్టాల ప్రకారం ఈ ఘటనను పరిశీలించిన అధికారులు, చట్ట ఉల్లంఘన జరిగినట్లు భావించి కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై చట్టపరమైన, సామాజిక చర్చలు మళ్లీ ఊపందుకుంటున్నాయి.
ALSO READ: సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం సమీక్ష
