
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అర్ధరాత్రి జరిగిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఇంట్లో నిద్రిస్తున్న పార్వతి అనే వృద్ధురాలిని ఆమె కోడలు తన ప్రియుడితో కలిసి హత్య చేసేందుకు యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యులే నిందితులుగా మారడం స్థానికులను షాక్‌కు గురి చేసింది. నిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఈ దాడిలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.
దాడి అనంతరం పార్వతి అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమె మృతి చెందినట్లు కోడలు భావించినట్లు తెలుస్తోంది. దీంతో తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె.. తన మూడేళ్ల బిడ్డను కూడా వెంట తీసుకెళ్లింది. ఈ ఘటన భర్త పెట్రోల్ బంకులో నైట్ డ్యూటీకి వెళ్లిన సమయంలోనే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ఈ నేరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
ఉదయం ఇంట్లో ఎలాంటి శబ్ధం రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా వృద్ధురాలు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు హత్యాయత్నంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కోడలు, ఆమె ప్రియుడు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. అలాగే వారి కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్ డేటా వంటి సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. మూడేళ్ల చిన్నారి భద్రతపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ALSO READ: ‘ఎర్రచీర’కు A సర్టిఫికేట్





