కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెనెజులా అధ్యక్షుడు మదురలోలాగే ట్రంప్ మోడీని కూడా కిడ్నాప్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. అమెరికా వాణిజ్య విధానాన్ని చవాన్ తప్పుపడుతూ భారత్-వెనెజువెలా మధ్య తెచ్చిన ఈ పోలిక రాజకీయ దుమారం రేపింది. భారత్ ఎగుమతులపై అమెరికా భారీగా సుంకాలు విధించడం వల్ల తలెత్తిన పరిస్థితులపై చవాన్ మాట్లాడుతూనే, వెనెజువెలాలో ఇటీవల జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. అనూహ్యమైన ప్రశ్నను లెవనెత్తారు. “తరువాత ఏం జరుగుతుందనేది ఇప్పుడు అసలు ప్రశ్న. వెనెజువెలాలో జరిగినట్టే ఇండియాలో కూడా జరుగుతుందా? ట్రంప్ మన ప్రధానమంత్రిని కూడా కిడ్నాప్ చేస్తారా?” అని ప్రశ్నించారు.
భారతీయ వ్యాపారులకు తీవ్ర నష్టం
భారత్ ఎగుమతులపై అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించిందని, ఇది భారతీయ వ్యాపారులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని చవాన్ అన్నారు. 50 శాతం సుంకంతో వ్యాపారం చేయడం సాధ్యం కాదని, నిజానికి ఇది భారత్ నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులను అడ్డుకోవడమే అవుతుందని తెలిపారు. ప్రత్యక్ష నిషేధం విధించలేరు కాబట్టే, వాణిజ్యాన్ని ఆపడానికి సుంకాలను ఒక సాధనంగా ఉపయోగించారని, భారత్ ఇది భరించక తప్పదన్నారు.
చవాన్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు
చవాన్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ప్రపంచ స్థాయిలో భారత ప్రతిష్ఠను బలహీనపరచేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ దిగజారుడుకు ఇది నిదర్శనమని బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి విమర్శించారు. ఇండియా పరిస్థితిని వెనెజువెలాతో పోల్చడం సిగ్గుచేటని, కాంగ్రెస్ దేశ వ్యతిరేక వైఖరి మరోసారి స్పష్టమైందని అన్నారు. భారతదేశ అంతర్గత వ్యవహరాల్లో విదేశీ జోక్యాన్ని కాంగ్రెస్ కోరుకుటోందని తప్పుపట్టారు.
ప్రధానిపై ఖర్గే విమర్శలు
అటు చవాన్ కంటే ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్డున్ ఖర్గే కూడా మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, మోడీ ఎందుకు ట్రంప్‌కు తలొంచుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఆయన విధానం దేశానికి ప్రమాదమని అన్నారు.





