
భారతదేశంలో 125cc స్కూటర్ల విభాగం అంటే వినియోగదారులకు వెంటనే గుర్తుకొచ్చే రెండు పేర్లు హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125. రోజువారీ ప్రయాణాలకు, కుటుంబ అవసరాలకు, అలాగే మైలేజీతో పాటు నమ్మకమైన పనితీరు కావాలనుకునే వారిలో ఈ రెండు స్కూటర్లు భారీ క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది కొనాలన్న సందేహం చాలా మంది కస్టమర్లను ఎప్పుడూ అయోమయంలో పడేస్తోంది.
ధర, మైలేజీ, ఇంజిన్ పనితీరు, ఫీచర్లు, బ్రాండ్ నమ్మకం వంటి అంశాల్లో ఈ రెండు స్కూటర్లు ఒకదానికొకటి గట్టి పోటీని ఇస్తున్నాయి. అందుకే కొనుగోలు ముందు పూర్తిస్థాయి పోలిక చేసుకోవడం తప్పనిసరి అవుతోంది.
ధర విషయానికి వస్తే.. హోండా యాక్టివా 125 కొంచెం ప్రీమియం సెగ్మెంట్‌గా కనిపిస్తుంది. యాక్టివా 125 ఎక్స్-షోరూమ్ ధర వేరియంట్‌ను బట్టి సుమారు రూ.89 వేల నుంచి రూ.93 వేల వరకు ఉంటుంది. అదే టీవీఎస్ జూపిటర్ 125 ధరలు చూస్తే, ఇవి రూ.75 వేల నుంచి ప్రారంభమై రూ.87 వేల వరకు మాత్రమే ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో 125cc స్కూటర్ కావాలనుకునే వారికి జూపిటర్ 125 ఎక్కువగా ఆకర్షణీయంగా మారుతోంది.
పనితీరు పరంగా చూస్తే.. ఈ రెండు స్కూటర్లు దాదాపు సమాన స్థాయిలోనే నిలుస్తాయి. హోండా యాక్టివా 125లో 123.92 సిసి ఇంజిన్ ఉండి 8.31 హెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. టీవీఎస్ జూపిటర్ 125లో మాత్రం 124.8 సిసి ఇంజిన్ అమర్చారు. ఇది 8.44 హెచ్‌పి శక్తిని ఇస్తుంది. పేపర్ మీద చూస్తే జూపిటర్ కొంచెం ఎక్కువ పవర్ కలిగి ఉన్నట్టు కనిపిస్తుంది.
నగర ట్రాఫిక్‌లో రోజువారీ ప్రయాణాలకు జూపిటర్ 125 ఇంజిన్ స్మూత్‌గా పనిచేస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. అదే సమయంలో యాక్టివా 125 కూడా స్థిరమైన పనితీరు, నమ్మకమైన రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. రెండింటిలోనూ సీవీటీ ట్రాన్స్‌మిషన్ ఉండటంతో గేర్ మార్పుల టెన్షన్ లేకుండా సులభంగా డ్రైవ్ చేయవచ్చు.
ఇంధన ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో మైలేజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయంలో హోండా యాక్టివా 125 కొంచెం ముందంజలో ఉంది. కంపెనీ వివరాల ప్రకారం యాక్టివా 125 లీటరుకు సుమారు 60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. టీవీఎస్ జూపిటర్ 125 మైలేజీ సుమారు 57 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది. వాస్తవ వినియోగంలో రైడింగ్ స్టైల్‌ను బట్టి ఈ అంకెల్లో తేడాలు ఉండొచ్చు. అయినప్పటికీ మైలేజీ పరంగా యాక్టివా కొద్దిగా మెరుగైన ఎంపికగా కనిపిస్తోంది.
ఫీచర్ల విషయానికి వస్తే టీవీఎస్ జూపిటర్ 125 ఒక అడుగు ముందుకేస్తుంది. ఇందులో 33 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఉంది. ఇది ఈ సెగ్మెంట్‌లోనే అతిపెద్ద స్టోరేజ్ సామర్థ్యం. రెండు హెల్మెట్లు కూడా సులభంగా పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, స్మార్ట్ కనెక్ట్ ఫీచర్లు, యూఎస్‌బీ ఛార్జింగ్ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా జూపిటర్‌లో అందుబాటులో ఉన్నాయి.
హోండా యాక్టివా 125లో కూడా ఆధునిక ఫీచర్ల కొరత లేదు. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంధనాన్ని ఆదా చేసే ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా హోండా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, దీర్ఘకాలిక పనితీరు యాక్టివాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది.
ఎక్కువ స్టోరేజ్, ఆధునిక టెక్నాలజీ, తక్కువ ధర కావాలంటే టీవీఎస్ జూపిటర్ 125 సరైన ఎంపికగా కనిపిస్తుంది. అదే నమ్మకమైన బ్రాండ్, కొంచెం మెరుగైన మైలేజీ, దీర్ఘకాలిక వినియోగం కావాలంటే హోండా యాక్టివా 125పై దృష్టి పెట్టవచ్చు. చివరికి మీ అవసరాలు, బడ్జెట్ ఆధారంగానే ఈ రెండు స్కూటర్ల మధ్య నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ALSO READ: చలికాలంలో పెరుగు తోడుకోవడం లేదా.. అయితే ఈ చిన్న ట్రిక్‌తో గెడ్డ పెరుగు కావడమైతే గ్యారెంటీ!





