భారతీయ జనతా పార్టీకి నూతన జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుత పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఎన్నిక కావడం ఖరారైంది. 45 ఏళ్ల చరిత్ర గల బీజేపీకి తొలిసారిగా పార్టీ కంటే చిన్న వయస్సుగల నితిన్ నబీన్ తొలిసారి అధ్యక్షుడు కాబోతున్నారు. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హర్దీ్‌పసింగ్ పురి, కిరిణ్ రిజుజు సహా పలువురు నాయకులు నితిన్ నబీన్‌కు మద్దతుగా నామినేషన్ దాఖలు చేశారు.
రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ ను నామినేషన్ పత్రాల సమర్పణ
పార్టీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్‌కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నితిన్ నబీన్‌కు మద్దతుగా వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో, పార్టీ ముఖ్యనేతలు నితిన్ నబీన్‌కు మద్దతుగా నామినేషన్లను దాఖలు చేయగా మొత్తం 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. బరిలో ఒక్కరే ఉండటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా ఖరారు కాగా, అధికారికంగా ప్రకటించడమే మిగిలింది.
ఇవాళ కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటన
ఇవాళ ఉదయం 11.30గంటల తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, ముఖ్య నేతల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ రిటర్నింగ్ ఆఫీసర్ కె.లక్ష్మణ్‌తో కలిసి బీజేపీ నూతన అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. నితిన్ నబీన్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు నామినేషన్ పత్రాలు సమర్పించారు. తెలంగాణ బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నేతృత్వంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య నామినేషన్ పత్రాలను లక్ష్మణ్‌కు అందజేశారు.
ఎవరీ నితిన్ నబీన్?
ఉమ్మడి బిహార్‌లోని రాంచీలో పుట్టిన నితిన్ నబీన్ తొలుత బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇంటర్ చదివిన ఆయన బీజేపీ తరఫున కొన్ని రాష్ట్రాలకు ఇన్‌ఛార్జిగా పని చేశారు. బిహార్ బాంకీపూర్ నుంచి వరుసగా 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉంది. బిహార్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాకు ఎదిగిన తొలి నేత నితిన్ నబీన్.





