జాతీయంలైఫ్ స్టైల్

చలికాలంలో పెరుగు తోడుకోవడం లేదా.. అయితే ఈ చిన్న ట్రిక్‌తో గెడ్డ పెరుగు కావడమైతే గ్యారెంటీ!

భోజనంలో ఎన్ని రకాల వంటకాలు ఉన్నా చివర్లో కొద్దిగా పెరుగుతో తింటేనే భోజనం పూర్తయిన తృప్తి కలుగుతుంది.

భోజనంలో ఎన్ని రకాల వంటకాలు ఉన్నా చివర్లో కొద్దిగా పెరుగుతో తింటేనే భోజనం పూర్తయిన తృప్తి కలుగుతుంది. అందుకే చాలామంది తమ రోజువారీ భోజనంలో పెరుగు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు. అయితే చలికాలం వచ్చిందంటే చాలా ఇళ్లలో ఎదురయ్యే ప్రధాన సమస్య పెరుగు సరిగా గడ్డకట్టకపోవడమే. ఎంత ప్రయత్నించినా పెరుగు పలుచగా మారిపోతుంది లేదా పాలుపాలుగానే మిగిలిపోతుంది.

దీనికి ప్రధాన కారణం చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటమే. సాధారణంగా పెరుగు బాగా తోడుకోవాలంటే ఒక నిర్దిష్టమైన వెచ్చదనం అవసరం. అది లేకపోతే పెరుగు ఎంతసేపు ఉంచినా గట్టిగా మారదు. అయితే కొన్నిసింపుల్ పద్ధతులు పాటిస్తే చలికాలంలో కూడా గట్టిగా, చిక్కగా, కమ్మగా పెరుగు తయారు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా పెరుగు తోడుకోవాలంటే గది ఉష్ణోగ్రత 37 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. కానీ చలికాలంలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు ఉండవు. అందుకే మనమే బయటి నుంచి అవసరమైన వెచ్చదనాన్ని కల్పించాల్సి ఉంటుంది. పెరుగు తోడుపెట్టిన తర్వాత ఆ పాత్రను దళసరి వస్త్రంతో చుట్టాలి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న వేడి బయటకు పోకుండా ఉంటుంది.

పాత్రపై మూత పెట్టడం కూడా చాలా ముఖ్యం. గాలి లోపలికి చొరబడకుండా మూత పెట్టి, చలిగాలి తగలని కాస్త వెచ్చగా ఉండే ప్రదేశంలో పాత్రను ఉంచాలి. ఇలా చేస్తే పెరుగు గట్టిగా తోడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇంట్లో ఓవెన్ ఉన్నవారు మరింత సులభంగా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఓవెన్‌ను ఒకటి రెండు నిమిషాలు 180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఆఫ్ చేయాలి. ఆ తర్వాత అందులో పెరుగు తోడేసిన పాత్రను ఉంచాలి. 6 నుంచి 7 గంటలు లేదా రాత్రంతా అలాగే ఉంచితే ఉదయం గడ్డపెరుగు సిద్ధమవుతుంది. ఈ విధానంలో పెరుగు రుచికరంగా, చిక్కగా తయారవుతుంది.

ఇంకో సులభమైన మార్గం బియ్యం డబ్బా. పెరుగు తోడేసిన పాత్రను బియ్యం డబ్బాలో ఉంచితే అక్కడి సహజ వెచ్చదనం వల్ల పెరుగు బాగా తోడుకుంటుంది. అలాగే థర్మాకోల్‌తో చేసిన పెట్టెలో ఉంచినా లోపల వేడి నిల్వ ఉండి పెరుగు గట్టిగా మారుతుంది.

పెరుగు నాణ్యత కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగు తోడుకోవడానికి ఉపయోగించే తోడు పెరుగు నాణ్యమైనదై ఉండాలి. పలుచగా, నీళ్లలా ఉన్న పెరుగుతో తోడుపెట్టితే ఫలితం ఉండదు. అలాగే పాల నాణ్యత కూడా చాలా ముఖ్యం. పాలల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటే పెరుగు ఎప్పటికీ చిక్కగా తోడుకోదు.

పాలలో తోడు వేసేముందు పాలు గోరువెచ్చగా ఉన్నాయా లేదా అన్నది తప్పకుండా చెక్ చేసుకోవాలి. మరీ వేడిగా ఉన్న పాలల్లో తోడు వేస్తే పెరుగు సరిగా కట్టకపోవడమే కాకుండా జిగురుగా లేదా నీళ్లలా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలు కాస్త చల్లారిన తర్వాత తోడు వేయడం ఉత్తమం. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలో కూడా ఇళ్లలో గడ్డపెరుగు సులభంగా తయారవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ: ఆకాశం నుంచి ఊడిపడ్డ వింత వస్తువు.. వీడియో ఇదిగో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button