
సూర్యుడు, భూమి, చంద్రుడు తమ తమ కక్ష్యల్లో ప్రయాణించే సమయంలో కొన్నిసార్లు అరుదైన ఖగోళ పరిణామాలు చోటుచేసుకుంటుంటాయి. వాటిలో ముఖ్యమైనది చంద్రగ్రహణం. భూమి సూర్యుడి చుట్టూ కక్ష్యలో ఉండగా, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలో భూమి సూర్యుడి మరియు చంద్రుడి మధ్యకు వచ్చినప్పుడు సూర్యకాంతి చంద్రుడిని చేరలేకపోతుంది. అప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడటంతో చంద్రుడి కొంత భాగం లేదా మొత్తం చీకటిగా మారుతుంది. ఈ ఖగోళ దృశ్యాన్నే చంద్రగ్రహణంగా శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి రోజునే సంభవిస్తుందన్నది ఖగోళ శాస్త్రంలో నిర్ధారితమైన అంశం. అయితే ప్రతి పౌర్ణమికీ గ్రహణం ఏర్పడదు. చంద్రుడి కక్ష్య భూమి కక్ష్యకు సుమారు ఐదు డిగ్రీల మేర వంగి ఉండటమే ఇందుకు కారణం. చాలాసార్లు పౌర్ణమి రోజున చంద్రుడు భూమి నీడకు కొద్దిగా పైగా లేదా కిందుగా ప్రయాణిస్తాడు. ఈ కారణంగా గ్రహణం ఏర్పడదు. సూర్యుడు, భూమి, చంద్రుడు పూర్తిగా ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడే చంద్రగ్రహణం సంభవిస్తుంది.
2026 సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన సంభవించనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ గ్రహణం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై అదే రోజు సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సమయంలో చంద్రుడిపై భూమి నీడ స్పష్టంగా కనిపించనుందని ఖగోళ నిపుణులు చెబుతున్నారు.
చంద్రగ్రహణం ప్రభావం దృష్ట్యా మార్చి 3వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని సంప్రోక్షణ చేసి, అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ క్రమంలో అదే రోజు రాత్రి 8 గంటల 30 నిమిషాల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
గ్రహణం నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారు. అష్టాదళ పాద పద్మారాధన, ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలు మార్చి 3వ తేదీన నిర్వహించబోమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
2026లో జరిగే తొలి చంద్రగ్రహణానికి మరో విశేషత కూడా ఉంది. ఈ గ్రహణం హోలీ పౌర్ణమి రోజునే సంభవించనుంది. హోలీ పండుగ 2026లో మార్చి 4వ తేదీన జరగనుండగా, హోలీ పౌర్ణమి మార్చి 2వ తేదీ సాయంత్రం 5 గంటల 56 నిమిషాల నుంచి మార్చి 3వ తేదీ సాయంత్రం 5 గంటల 7 నిమిషాల వరకు కొనసాగుతుంది. అంటే హోలీ పౌర్ణమి రోజునే ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం సంభవించడం ఖగోళ పరంగా ప్రత్యేకతగా భావిస్తున్నారు. ఒకవైపు పండుగ వాతావరణం, మరోవైపు అరుదైన ఖగోళ దృశ్యం కలగలిపి ఈ రోజు విశేషంగా మారనుంది. భక్తులు, ఖగోళ ఆసక్తిగల వారు ఈ గ్రహణాన్ని ఆసక్తిగా గమనించేందుకు సిద్ధమవుతున్నారు.
NOTE: పై వార్తలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. క్రైమ్ మిర్రర్ వీటిని ధృవీకరించడం లేదు. పాఠకులు గమనించగలరు.
ALSO READ: Madaram: జాతరలో ఉద్రిక్తత.. మంత్రి కాన్వాయ్‌పై దాడి?





