
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. శ్రీవారి సేవలో భాగంగా భారీ విరాళాలు అందజేస్తున్న దాతలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రూ.కోటి విరాళం అందించే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలను ప్రకటిస్తూ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ సౌకర్యాలు తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులను మినహాయించి, మిగతా సాధారణ రోజుల్లో అమల్లో ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది.
శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. రూ.కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలంలో దాతతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులకు ప్రతి ఏడాది పలు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. ఇది భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరిచే నిర్ణయంగా భావిస్తున్నారు.
ఈ ప్రత్యేక పథకం కింద ఏడాదిలో మూడు రోజులు సుప్రభాత సేవలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. అలాగే మరో మూడు రోజులు బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటు ఇస్తారు. అదనంగా నాలుగు రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం దాతలకు లభించనుంది. ఈ విధంగా మొత్తం పది రోజులు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించనున్నారు.
దర్శనాలతో పాటు ప్రసాద సౌకర్యాలను కూడా టీటీడీ ప్రకటించింది. ప్రతి ఏడాది దాతలకు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు అందించనున్నారు. అలాగే ఒక దుప్పట, ఒక రవికే, 10 మహా ప్రసాదం ప్యాకెట్లు కూడా అందిస్తామని స్పష్టం చేసింది. ఏడాదికి ఒకసారి వేద ఆశీర్వచనం పొందే అవకాశాన్ని కూడా ఈ పథకంలో భాగంగా కల్పించనున్నారు.
వసతి విషయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమలలో దాతలకు రూ.3 వేల అద్దె విలువ చేసే వసతి గదులను మూడు రోజుల పాటు కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. దీంతో దర్శనానికి వచ్చే దాతలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇచ్చే ప్రత్యేక గౌరవంగా, రూ.కోటి విరాళం అందించిన దాతకు ఒక 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్, అలాగే ఒక 50 గ్రాముల వెండి డాలర్ అందజేస్తామని టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం అవసరమైన ఆధార పత్రాలను సంబంధిత కార్యాలయంలో చూపించి ఈ బహుమతులను పొందవచ్చని స్పష్టం చేసింది.
విరాళాల చెల్లింపుకు కూడా టీటీడీ సులభమైన మార్గాలను సూచించింది. దాతలు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ttddevasthanams.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో విరాళాలు చెల్లించవచ్చు. అలాగే ఆఫ్‌లైన్‌లో విరాళాలు ఇవ్వాలనుకునే వారు ఈవో, టీటీడీ పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ లేదా చెక్ తీసుకుని తిరుమలలోని దాతల విభాగం అయిన డోనార్ సెల్‌లో అందజేయాలని టీటీడీ కోరుతోంది.
ALSO READ: Farting: వెనుక నుంచి గ్యాస్ బాగా వస్తే మంచిదేనట!..





