PM Modi Warns States: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. కరోనా కాలంలోలా అన్ని రాష్ట్రాలు కలిసి టీం ఇండియాలా పనిచేస్తే ఈ సవాళ్లను కూడా విజయవంతంగా ఎదుర్కోగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అన్ని రాష్ట్రాల సీఎంలతో పీఎం సమావేశం
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంపై కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధాని శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిస్థితులు రోజురోజుకీ మారుతున్నాయని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు
దేశంలో ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, సరఫరా వ్యవస్థలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగాలని ప్రధాని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇంధన భద్రతపై దృష్టి పెట్టాలని, అవసరమైన వస్తువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధరలు అక్రమంగా పెంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలని ఆదేశించారు. ప్రతి జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ దగ్గరపడుతున్నందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎరువుల సరఫరాను సమర్థంగా నిర్వహించాలని అన్నారు.
తప్పుడు వార్తలపై ప్రత్యేక నిఘా
తప్పుడు వార్తలు, వదంతులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రజలకు సరైన సమాచారం అందించాలని ప్రధాని తెలిపారు. అలాగే ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఏజెంట్ల నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న భారతీయుల భద్రతకు సంబంధించి రాష్ట్రాలు హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయాలని, నోడల్ అధికారులను నియమించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అదే సమయంలో యుద్ధం పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్రం ప్రత్యేక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
